KTR: మళ్ళీ వచ్చాక.. ప్రభుత్వానికి పార్టీకి సమ న్యాయం: కేటీఆర్
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:33 PM
కేసీఆర్ మళ్లీ కీలకం కావాలంటే, లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు .. రేవంత్ రెడ్డికి లొల్లి ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. మళ్ళీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వానికి, పార్టీకి సమ న్యాయం చేస్తామని..

హైదరాబాద్, జులై 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపు అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమని కేటీఆర్ చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రీ ఫైనల్స్ లాంటివన్నారు. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్దం కావాలని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మళ్ళీ కేసీఆర్ కీలకం కావాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమని కేటీఆర్ చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ పార్టీ శ్రేణులతో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్న కేటీఆర్.. పోటీచేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. 'పార్టీ పరంగా ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకంగా కొట్లాడుతాం. అభ్యర్థులకు అండగా ఉంటాం. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ క్యాడర్.. కాంగ్రెస్ హామీలు, మోసాలు చెప్పాలి. కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టకుంటే భవిష్యత్తులో మళ్ళీ నష్టపోతాం. బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టడం దారుణం. రేషన్ కార్డులు ఇవ్వటం గొప్ప పని కాదు.. అది ప్రభుత్వం బాధ్యత. బీఆర్ఎస్ హాయాంలో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. మల్కాజిగిరిలో ఇద్దరు కాంగ్రెస్ గుండాల ప్రవర్తనకు బుద్ది చెప్తాం. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తే.. కాంగ్రెస్ గూండాలు లైన్ లోకి వస్తారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు .. రేవంత్ రెడ్డికి లొల్లి ఎక్కువ. ఆరు గ్యారంటీల్లో.. మూడు మోసాలను ప్రజలకు వివరించాలి. ఒక్కో ముసలమ్మకు రేవంత్ ప్రభుత్వం 40వేల బాకీ ఉంది. పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు. నాట్లు అప్పుడు కాకుండా.. ఓట్లు అప్పుడు రైతుబంధు వేసి సంబురాలు చేసుకోమంటున్నాడు. ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక.. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పడి ఏడుస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలవనీయం. ఎవరు గాడిదో.. ఎవరు గుర్రమో ప్రజలకు అర్థమైంది. కేసీఆర్‌కు నిజమైన తమ్ముడిగా జగదీష్ రెడ్డి విరోచిత పోరాటం చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వానికి, పార్టీకి సమ న్యాయం చేస్తాం.' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
అల్‌ఖైదా కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోమ్ డ్రింక్స్ మీ కోసమే.!