TSRTC Jobs: ఆర్టీసీలో కొలువుల జాతర
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:21 AM
తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తితో నియామకాలకు మార్గం సుగమమైంది; నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని మంత్రి ప్రకటించారు

3,038 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ఎస్సీ వర్గీకరణతో నియామకాలకు మార్గం సుగమం
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచన
‘మహాలక్ష్మి’తో మహిళలకు రూ.5,500 కోట్ల లబ్ధి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో త్వరలో కొలువుల జాతర ప్రారంభం కానున్నది. ఇప్పటికే 3,038 ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలో నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆదివారం ఓ ప్రకటనలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రారంభం కానుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలోనే ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని భావించినా.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆలస్యమైందన్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైందని చెప్పారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ఇప్పటిదాకా మహాలక్ష్మి పథకం కింద 165కోట్ల టికెట్లు జారీ చేయగా, రాష్ట్ర మహిళలకు రూ.5,500కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. మహాలక్ష్మి పథకం అమలుకు కొత్త బస్సులు కొనుగోలు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడ్డాక 60వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుందని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భర్తీ చేసే ఉద్యోగాలు : 3,038
డ్రైవర్: 2,000.. శ్రామిక్: 743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్): 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్): 114
డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్: 18
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 23
సెక్షన్ ఆఫీసర్ ( సివిల్): 11
అకౌంట్ ఆఫీసర్లు: 6
మెడికల్ ఆఫీసర్లు (జనరల్): 7
మెడికల్ ఆఫీసర్లు (స్పెషలిస్ట్): 7
Also Read:
క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి
For More Telangana News and Telugu News..