Share News

Artificial Intelligence: ఏఐ డబుల్‌ ఇంజన్‌!

ABN , Publish Date - Feb 14 , 2025 | 03:47 AM

ప్రపంచగతిని మార్చబోతున్న ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వ అధికారులు మొత్తం 1.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ముందడుగు పడింది.

Artificial Intelligence: ఏఐ డబుల్‌ ఇంజన్‌!

  • తెలంగాణతో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌

  • 500 బడుల్లో 50 వేల మందికి ఏఐ పాఠాలు

  • 50 వేల ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ!

  • డేటా సెంటర్లలో 15వేల కోట్ల పెట్టుబడులు

  • ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌ యాజమాన్యం

  • వ్యవసాయం, ట్రాఫిక్‌లో గూగుల్‌ ఏఐ అండ

  • డిజిటల్‌ డివైడ్‌ తగ్గించడంతో సాయం

  • ఒకే రోజు ఇరు కంపెనీల భారీ ప్రణాళికలు

  • ముఖ్యమంత్రి రేవంత్‌ సమక్షంలో ఒప్పందాలు

  • భవిష్యత్తు అంతా కృత్రిమ మేధదే

  • టెక్నాలజీలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

  • మైక్రోసాఫ్ట్‌ కొత్త భవనం ప్రారంభోత్సవంలో సీఎం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ప్రపంచగతిని మార్చబోతున్న ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వ అధికారులు మొత్తం 1.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ముందడుగు పడింది. అంతేకాకుండా రాష్ట్రంలో వ్యవసాయం, ట్రాఫిక్‌ రంగాల్లో భారీఎత్తున ఏఐని వినియోగించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించి ఆయా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐలో శిక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు రెండు ప్రపంచ దిగ్గజ ఐటీకంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సిద్ధమయ్యాయి. ఈ మేరకు రెండు కంపెనీలతో గురువారం రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ నిర్మించిన భవనం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒక ఒప్పందం కుదరగా, టీ హబ్‌లో ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగిన మరో కార్యక్రమంలో గూగుల్‌తో మరో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, టెక్నాలజీ రంగంలో భారీ ఉద్యోగ అవకాశాలకు కృత్రిమ మేధ అత్యంత కీలకం కాబోతుందని చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రకటించారు. ఐటీరంగంలో ఇప్పటికే హైదరాబాద్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందన్నారు.


ఏఐతో రాష్ట్రం మరింత ప్రత్యేకత సాధిస్తుందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఐటీ ప్రయాణంలో ఈ రోజు కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో 2,500 ఉద్యోగులకు సరిపడేలా మైక్రోసాఫ్ట్‌ కొత్త భవనం నిర్మించడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. మైక్రోసా్‌ఫ్టకు, హైదరాబాద్‌ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని, మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్‌ రాకతో హైదరాబాద్‌ నగరం పేరు ప్రపంచ వ్యాప్తమైందని గుర్తు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ విస్తరణతో ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ఏఐ ఫౌండేషన్‌ అకాడమీలో ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్‌ భాగస్వామిగా ఉంటుందని ప్రకటించారు. ఈ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విద్యను ప్రవేశ పెడతామని చెప్పారు. ప్రభుత్వ పాలన, ప్రజాసేవల్లోనూ ఏఐని ఉపయోగిస్తామని ప్రకటించారు. ఏఐ రంగంలో పెట్టుబడి హైదరాబాద్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తుందని, కొత్త కంపెనీలకు మార్గదర్శనం లభిస్తుందని, ఏఐ టూల్స్‌ అందుబాటులోకి వస్తాయని, అంతర్జాతీయ పరిచయాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్‌ ఏఐ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నానన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు మైక్రోసాఫ్ట్‌ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆవిష్కరణల పట్ల మైక్రోసాఫ్ట్‌ నిబద్థత తెలంగాణ రైజింగ్‌ విజన్‌కు తోడవుతుందని వ్యాఖ్యానించారు.


మెరుగైన పాలనకు ఏఐతోడు

టీ-హబ్‌లో గూగుల్‌ ఒప్పంద కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఏఐ వినియోగంలో తెలంగాణ దార్శనికతకు గూగుల్‌ సహకారం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఏఐ టెక్నాలజీతో కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు తేవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని, ఈ లక్ష్య సాధనలో గూగుల్‌ ఒప్పందం కీలకంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ ప్రీతి లోబానా మాట్లాడుతూ, ఏఐ ఆధారిత మానవ వనరులను పెంచడం, స్టార్ట్‌పలను ప్రోత్సహించడం, వ్యవసాయం, విద్య లాంటి కీలక రంగాల్లో పని చేయటం ఉత్సాహంగా ఉందని అన్నారు.

500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన

మైక్రోసాఫ్ట్‌ అడ్వాంటేజ్‌ తెలంగాణ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఏఐని పరిచయం చేసేందుకు ప్రాథమిక కోర్సులు ప్రారంభించనుంది. దీనికోసం మైక్రోసాఫ్ట్‌ ప్రత్యేకంగా ఏఐ ఫౌండేషన్స్‌ అకాడమీ ఏర్పాటుచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రభుత్వ పాఠశాలల్లో 100 మంది చొప్పున మొత్తం 50 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఏఐ ఇండస్ర్టీ ప్రో పేరుతో చిన్న, భారీ పరిశ్రమల్లోని 20 వేల మంది నిపుణులకు ఏఐ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ఏఐ గవర్న్‌ ఇనీషియేటివ్‌ పేరుతో 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాలలో శిక్షణ ఇస్తారు.


రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ స్థాపిస్తామని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఏఐ నాలెడ్జ్‌ హబ్‌తో పాటు ఏఐ అభివృద్ధికి క్లౌడ్‌-ఆధారిత మౌలిక సదుపాయాలు ఇందులో ఉంటాయి. రాష్ట్రంలో వేల మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా ఉత్తమ పరిశోధన పద్థతులు అందుబాటులో ఉంచుతుంది. ఏఐ అభివృద్థితో పాటు రాష్ట్రంలో హైపర్‌ స్కేల్‌ ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులను రెట్టింపు చేస్తామని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఇంతవరకు ప్రకటించిన పెట్టుబడులకు అదనంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

విద్య, వ్యవసాయంలో గూగుల్‌ సహకారం

విద్య, వ్యవసాయం, సుస్థిరాభివృద్థి, పరిపాలన, రవాణా, తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలు, పరిష్కారాలు అమలుచేస్తామని గూగుల్‌ తెలిపింది. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా డిజిటల్‌ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్థం చేసేందుకు వ్యూహాత్మక సహకారం అందించనుంది. రైతులకు వ్యవసాయ సంబంధిత ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించనుంది. రవాణా సదుపాయాలను మెరుగుపరిచే డేటా ఇంటిగ్రేషన్‌ సదుపాయాల కల్పనలోనూ భాగస్వామ్యం పంచుకుంటుంది. గూగుల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ఏఐ నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్‌ అభ్యసన పద్దతులను ప్రారంభిస్తుంది. గూగుల్‌ వర్క్‌ స్పేస్‌, క్రోమ్‌ సర్వీసె్‌సను అందిస్తుంది. రైతులకు అవసరమైన ఇన్‌పుట్‌, మార్కెటింగ్‌ సదుపాయాలన్నీ అనుసంధానం చేస్తూ తెలంగాణ వ్యవసాయ నెటవర్క్‌ను ప్రారంభిస్తుంది.


  • అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి

  • ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న

  • కోర్‌ అర్బన్‌ ఏరియాపై సీఎం రేవంత్‌ ఆదేశం

ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న కోర్‌ అర్బన్‌ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకువెళ్లాలని సీఎం రేవంత్‌ రెడ్డి పురపాలక శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్‌ సర్వేను కోర్‌ అర్బన్‌ ఏరియా మొత్తం నిర్వహించాలని ఆదేశించారు. గురువారం పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో ఇళ్లు, మంచినీటి సరఫరా, విద్యుత్‌ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలు ేసకరించాలని, తద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచవచ్చని సూచించారు. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైతే గూగుల్‌ సాంకేతిక సహకారం తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లై-ఓవర్‌ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. భూసేకరణ, ఇతర పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

Updated Date - Feb 14 , 2025 | 03:47 AM