Railway Budget: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై వివక్ష
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:12 AM
రైల్వేలకు బడ్జెట్ కేటాయింపులు పెంచకపోవడంతో రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు.

బడ్జెట్ కేటాయింపులు పెంచని కేంద్రం.. నత్తనడకన సాగుతున్న పనులు
అతీగతీలేని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
కేంద్రానికి సవతితల్లి ప్రేమ అని ఆరోపణలు
హైదరాబాద్/సిటీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రైల్వేలకు బడ్జెట్ కేటాయింపులు పెంచకపోవడంతో రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు. 2025-26 బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.14,754 కోట్లు కేటాయించగా ఇందులో సింహభాగం (రూ.9,417 కోట్లు) పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రాజెక్టుల కోసమే వ్యయం చేయనున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5,336 కోట్లు కేటాయించగా ఈసారి నిధులు పెంచకుండా కేవలం రూ.5337 కోట్లకే పరిమితం చేయడం బీజేపీ ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం నిరుడు రూ.9,151 కోట్లు కేటాయించగా ఈసారి రూ.266 కోట్లు పెంచి, రూ.9,417 కోట్లు కేటాయించారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించలేదని, తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమకు ఇదే నిదర్శనమన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 41,677 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. నిధుల కొరత కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. సగానికి పైగా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు ఇప్పటికీ చేపట్టకపోవడం గమనార్హం. నిదుల కేటాయింపుల్లో వివక్ష కారణంగా ఏళ్ల తరబడి పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలున్నాయి. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణలో 1465 కి.మీ. ట్రాక్ విద్యుదీకరణతో 100 శాతం పూర్తి చేసినట్లయింది. ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థను 1026 కి.మీ. పరిధిలో ఏర్పాటు చేసింది.
అతిపెద్ద డివిజన్‌గా సికింద్రాబాద్!
జోన్ల విభజనతో మారిన డివిజన్ల రూపురేఖలు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. ఇప్పటికే జోన్ పరిధిలో పెద్ద డివిజన్‌గా ఉన్న సికింద్రాబాద్‌కు ఇతర డివిజన్ల నుంచి రైల్వే లైన్ తోడవుతుండడంతో అతిపెద్ద డివిజన్‌గా అవతరించనుంది. 1966లో 1,490 కిలోమీటర్ల రైల్వే లైన్‌తో ఏర్పాటైన సికింద్రాబాద్ డివిజన్ దాదాపు 60 ఏళ్ల తర్వాత విస్తరించబోతోంది. రైల్వేబోర్డు తాజా ప్రతిపాదనల మేరకు డివిజన్ నుంచి 46 కిలోమీటర్ల రైల్వేలైన్ వేరేజోన్‌కు బదిలీ అవుతుండగా, ఇతర జోన్ల నుంచి 250 కి.మీ. జత కానుంది. దీంతో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే లైన్ పొడవు 1,694 కిలోమీటర్లకు చేరనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి కొంత భాగాన్ని విడదీస్తూ సౌత్ కోస్టల్ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది.
గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూర్-వాడి స్టేషన్ల మధ్యనున్న 108 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌కు బదలాయించాలని రైల్వేబోర్డు ప్రతిపాదించింది. ఇందులో కొంతభాగం ప్రతిపాదిత సౌత్ కోస్టల్ రైల్వే, మరికొంత సెంట్రల్ రైల్వే పరిధిలోనిది కావడం విశేషం. సికింద్రాబాద్ డివిజన్ నుంచి రాయచూర్ సమీపంలోని రెండు పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణాలో ఇబ్బందులు ఎదురవకుండా ఈ నిర్ణయం తీసున్నట్లు రైల్వే బోర్డు ఈడీ సంజీవ్‌కుమార్ పేరిట విడుదల చేసిన లేఖలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రైల్వేబోర్డు ప్రతిపాదనల లేఖపై జనవరి 10వ తేదీ ఉండడంతో, రైల్వే అధికారులు ధ్రువీకరించడం లేదు. కానీ, లేఖలో ప్రస్తావించిన డివిజన్ల సరిహద్దు ప్రతిపాదనలను కొట్టిపారేయలేమని చెబుతుండడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..