Share News

SC Categorization: ఏ.. బీ.. సీ..!

ABN , Publish Date - Feb 04 , 2025 | 03:38 AM

రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్‌ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గతంలోలా ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

SC Categorization: ఏ.. బీ.. సీ..!

మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ

  • దాని ప్రకారమే మాదిగ, మాల సహా ఉప కులాలకు రిజర్వేషన్ల కేటాయింపు

  • ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ సూచన

  • దానిపై రెండుసార్లు మంత్రి ఉత్తమ్‌ నేతృత్వంలోని సబ్‌ కమిటీ సమావేశం

  • సీఎం రేవంత్‌ను కలిసి వివరణ నేడు క్యాబినెట్‌కు.. వెంటనే అసెంబ్లీకి

  • కులగణన నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ

  • ఎస్సీ ఉప కులాల వర్గీకరణపైనా అస్త్రశస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్‌ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గతంలోలా ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఆయా గ్రూపుల్లో మాదిగ, మాల సహా మిగిలిన ఉప కులాల జనాభా శాతం, వాటికి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిషన్‌ తన నివేదికను సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు అందించగా.. ఆ శాఖ అధికారులు దానిని మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించారు. నివేదికపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని ఉప సంఘం సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం రెండు దఫాలుగా సమావేశమై నివేదికలోని పలు అంశాలను పరిశీలించి చర్చించింది. దీనిలో సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, ఎంపీ మల్లు రవి ఉన్న విషయం తెలిసిందే. అనంతరం సబ్‌ కమిటీ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి.. నివేదికలోని విషయాలను వివరించింది. మంగళవారం ఆ నివేదికను తొలుత క్యాబినెట్‌లో; అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ చేయనున్నారు.


రిజర్వేషన్లు ఎవరికి ఎలా!?

ఆయా కులాల్లోని విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక విషయాలతోపాటు పలు అంశాలపై 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ అధ్యయనం చేసింది. మొత్తం ఎస్సీల్లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు? ఉప కులాల జనాభా ఎంత!? తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసింది. ఎవరెవరిని ఏయే గ్రూపుల్లో ఉంచాలనే అంశాన్ని పరిశీలించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 52.50 లక్షల మంది ఎస్సీలుండగా.. వీరిలో మాదిగలు 33.50 లక్షలు, మాలలు 19 లక్షల మంది ఉన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం ఎంత!? విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎంతమంది? ఉపకార వేతనాలను ఎంతమంది అందుకున్నారు? ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ఎంతమంది పొందారనే వివరాలను కూడా సేకరించి, పరిశీలించింది. అలాగే, ఎస్సీల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారనే వివరాలను కూడా సేకరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపి దాదాపు 94 వేల మందికి పైచిలుకు ఉన్నట్టు ఆయా శాఖలు కమిషన్‌కు ఇచ్చిన రిపోర్టుల్లో తేలింది. ఇక ఎస్సీలకు రాజకీయ అవకాశాలపైనా వివరాలు సేకరించింది. గ్రామ, మునిసిపాలిటీ ల్లో వార్డు సభ్యుని నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ సహా ఇప్పటి వరకూ వారు రాజకీయ ప్రాతినిధ్యం వహించిన వివరాలను తీసుకుంది. ఈ అంశాలన్నిటినీ అధ్యయనం చేసి.. మాదిగ, మాల సహా ఉప కులాలకు కేటాయించాల్సిన రిజర్వేషన్లపై పలు సూచనలు చేస్తూ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. కాగా, ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటైన కమిషన్‌ ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోందనే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ‘ఎస్సీ వర్గీకరణ నివేదిక కొలిక్కి’ శీర్షికన జనవరి 25న కథనాన్ని ప్రచురించింది.


అప్పుడు నాలుగు.. ఇప్పుడు మూడు

ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పటి నుంచే ఉద్యమాలు సాగుతున్నాయి. జనాభా ఆధారంగా ఎస్సీలకు ప్రస్తుతం 15 శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. అయితే, సంఖ్యాపరంగా అధికంగా ఉన్న తమకు తక్కువ కోటా అమలవుతోందని, దీనికి 1965నాటి లోకూర్‌ కమిషన్‌ నివేదికలే నిదర్శనమని మాదిగలు అంటున్నారు. ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌ 1994లో తెరపైకి వచ్చింది. దీనిపై 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జస్టిస్‌ రామచంద్ర రాజు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దాని సూచనల మేరకు ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి.. వారికి 15 శాతం రిజర్వేషన్‌ను ఆయా గ్రూపుల వారీగా కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం.. గ్రూప్‌-ఏలో రెల్లి సహా దానికి అనుబంధంగా ఉన్న 12 కులాలకు 1 శాతం రిజర్వేషన్‌ కేటాయించింది. వాటిని అట్టడుగు కులాలుగా గుర్తించింది. గ్రూప్‌-బిలో మాదిగ, దాని అనుబంధంగా ఉన్న 18 కులాలను చేర్చి.. వీరికి 7 శాతం కోటాను ఇచ్చింది. ఇక, గ్రూప్‌-సిలో మాల సహా 25 కులాలను చేర్చి, వీరికి 6 శాతం రిజర్వేషన్‌ కేటాయించింది. గ్రూప్‌-డిలో ఆది ఆంధ్రులతోపాటు మరో 4 కులాలను చేర్చి వీరికి కూడా 1 శాతం రిజర్వేషన్‌ను ఇచ్చింది. అయితే, ఈ కేటాయింపులపై పలువురు కోర్టుకెళ్లడంతో ఆ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. దాంతో, వర్గీకరణ కోసం 2000లో మరోసారి ‘రేషనలైజేషన్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌’ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. దీనిని 2004లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం ఎస్సీలను నాలుగు గ్రూపులుగా విభజించగా.. అక్తర్‌ కమిషన్‌ మూడు గ్రూపులుగా విభజించాలని సూచించినట్టు సమాచారం.

Updated Date - Feb 04 , 2025 | 03:38 AM