Inter Caste Incident: పాలమూరులో కులోన్మాద హత్య
ABN , Publish Date - Nov 16 , 2025 | 08:19 AM
వేరే కులం యువకుడు తన కూతురిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడన్న కక్షతో రగిలిపోయిన ఆ తండ్రి.. ఆ యువకుడి అన్నను అపహరించి దారుణంగా హత్య చేశాడు. ఈ కులోన్మాద హత్య మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది.
తన కుమార్తెను ఎస్సీ యువకుడు పెళ్లి చేసుకున్నాడన్న పగతో రగిలిపోయిన తండ్రి
వరుడి సోదరుడి అపహరణ.. హత్య, దహనం
షాద్‌నగర్ రూరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): వేరే కులం యువకుడు తన కూతురిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడన్న కక్షతో రగిలిపోయిన ఆ తండ్రి.. ఆ యువకుడి అన్నను అపహరించి దారుణంగా హత్య చేశాడు. ఈ కులోన్మాద హత్య (Inter Caste Incident) మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద శివారు ఎల్లంపల్లి (Yellampally) గ్రామానికి చెందిన కాగుల వెంకటేశ్ కూతురు 18 ఏళ్ల భవాని, అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (25) అనే దళిత యువకుడు ప్రేమించుకున్నారు. భవాని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. చంద్రశేఖర్ ఆటో నడుపుకొంటున్నాడు. నెలక్రితం ఇద్దరు వివాహం చేసుకున్నారు.
ఇది తెలిసి భవాని కుటుంబసభ్యులు షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలో అమ్మాయి, అబ్బాయి వేర్వేరుగా ఉండేలా పెద్దల మధ్య ఒప్పందంకుదిరింది. అయితే ఫోన్లో మాత్రం అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఊర్లో నుంచి వెళ్లిపోయారు. కాగా చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ (30) తన భార్యతో కలిసి షాద్‌నగర్‌లోని అయ్యప్ప కాలనీలో ఆరేళ్లుగా అద్దెకు ఉంటున్నాడు.
తన కూతురును చంద్రశేఖర్ తీసుకెళ్లడంతో కోపంతో రగిలిపోయిన వెంకటేశ్ బుధవారం రాత్రి కొందరిని వెంటేసుకొని షాద్‌నగర్‌కు వెళ్లాడు. రాజశేఖర్‌ను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. అతడిని అదేరోజు రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం యన్మన్‌గండ్ల శివారులో హత్యచేశాడు. మృతదేహాన్ని పెట్రోలు పోసి కాల్చివేశాడు. కిడ్నాప్ జరిగిన రోజే మృతుడి భార్య వాణి షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. భవాని, చంద్రశేఖర్ అచూకీ లభించలేదు.