KTR: కొడంగల్‌లో రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:42 AM
‘‘మీ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన రేవంత్‌రెడ్డి మీకు మంచి చేయాల్సింది పోయి 70 మందిపై కేసులు పెట్టి 40 మందిని నలబై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డల గోసపుచ్చుకున్నాడు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
కేసీఆర్ తీసిపెట్టిన రైతుబంధు డబ్బులే తప్ప కాంగ్రెస్ ఒక్క రూపాయీ ఇవ్వలే
స్థానిక ఎన్నికల్లో కాంగ్రె్‌సకు బుద్ధి చెప్పాలి.. రైతు దీక్షలో కేటీఆర్
మహబూబ్‌నగర్/కోస్గి/కొడంగల్/దుద్యాల, ఫిబ్రవరి 10 (ఆంధ్ర జ్యోతి) : ‘‘మీ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన రేవంత్‌రెడ్డి మీకు మంచి చేయాల్సింది పోయి 70 మందిపై కేసులు పెట్టి 40 మందిని నలబై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డల గోసపుచ్చుకున్నాడు. ఈ వేదికపై నుంచి రేవంత్‌రెడ్డికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా కొడంగల్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలబడితే మా పార్టీ నుంచి పట్నం నరేందర్‌రెడ్డి పోటీ చేస్తారు. మేమెవరమూ ప్రచారం చేయం. నరేందర్‌రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటారు. జిల్లా నాయకులు కొందరు మాత్రమే తిరుగుతారని మాటిస్తున్నా. మీరు గెలిస్తే, గెలవడం కాదు పట్నం నరేందర్‌రెడ్డికి 50 వేల మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయ సన్యాసం చేస్తా’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో సోమవారం నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. కొడంగల్‌లో ఉండే గిరిజన, బంజార బిడ్డలు తలుచుకుంటే రేవంత్‌ను చిత్తుగా ఓడించి మళ్లీ అచ్చంపేటకు పంపిస్తారని అన్నారు. ‘‘వాట్సా్‌పలో వీడియోలు చూస్తే ఏమన్న తిట్లా అవి, తెలుగుభాషలో ఉన్న తిట్లన్నీ తిడుతున్నారు.
రేవంత్‌రెడ్డి కాబట్టి, రోషం లేని బతుకు కాబట్టి నడుస్తోంది. మనిషన్నోడు ఇంకోడింకోడు అయితే బకెట్‌లో రెండు మగ్గుల నీళ్లు పోసుకొని దుంకి సచ్చిపోతుండే. మీరు కూడా కొంచెం తిట్టకండి.. కనీసం ఆయన పదవికైనా గౌరవం ఇవ్వండి. ఎన్నికల్లో మాత్రం ఈ మోసగాడికి గట్టిగా బుద్ధి చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు. రుణమాఫీ చారానా వంతు కూడా పూర్తి కాలేదని, రైతుబంధు డబ్బులు టకీటకీమని పడతాయని చెప్పినా ఇప్పటికీ పడలేదని ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 12 సార్లు రైతుబంధు ఇచ్చారని, ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ.7600 కోట్లు జమ చేస్తే ఇదే రేవంత్‌రెడ్డి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి పంపిణీని ఆపేయించారని గుర్తు చేశారు. రేవంత్ సీఎం అయ్యాక నాలుగు నెలలు ఆపి ఎంపీ ఎన్నికల ముందు అవే డబ్బులను వేశాడని మండిపడ్డారు. రైతు బంధు కింద ఒక్కో ఎకరాకు రూ.17,500 దాకా ప్రభుత్వం బాకీ పడిందని, ఆ డబ్బులు ఇచ్చే వరకూ రైతులు నిలదీయాలని సూచించారు. ఎన్నికల వేళ ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్.. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తాననడం మోసం కాదా, ఆయనపై చీటింగ్ కేసు పెట్టొద్దా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల గండం దాటితే అది కూడా ఇవ్వరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
భూమిగా నామకరణం
లగచర్ల భూముల విషయంలో ఉద్యమించిన పులిచర్లకుంట తండాకు చెందిన పాత్లావత్ ప్రవీణ్, జ్యోతి దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. దుద్యాల మండలంలోని హకీంపేట్ గేట్ వద్దకు చేరుకున్న కేటీఆర్‌ను వారు కలిసి.. పాపకు పేరు పెట్టాలని కోరారు. భూమి కోసం పోరాడుతున్న సమయంలో పుట్టిన ఆడ బిడ్డ కావడంతో భూమి, ధాత్రి, అవని అనే పేర్లలో ఒకటి పెట్టుకోవాలని కేటీఆర్ సూచించగా.. భూమి అని పెట్టుకుంటామని వారు బదులిచ్చారు. ఇక నుంచి పాపను పాత్లావత్ భూమి నాయక్‌గా పిలుచుకుంటామని తల్లిదండ్రులు చెప్పినట్లు రైతు దీక్ష సభలో కేటీఆర్ వివరించారు. కాగా, రైతు దీక్షకు ముందు కోస్గిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో కేటీఆర్ కరచాలనం చేసే సమయంలో చిన్న పాటి గాయమైంది. దీక్షకు వస్తుంటే దారిపొడవునా పెద్దసంఖ్యలో వచ్చిన జనం కదలనివ్వలేదని, చివరకు తన వేలికి గాయమై రక్తం వచ్చిందని.. కేటీఆర్ నవ్వుతూ చెప్పారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News