TG News: దర్జాగా దందా.. దొరికితేనే దొంగ !
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:25 PM
Police Stations in Settlements: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా పోలీస్‌స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసే పేరుతో నేరుగా స్టేషన్ల వద్దకు పిలిపించి బేరాలు మాట్లాడే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో గాడితప్పుతున్న పోలీసు వ్యవస్థ
ఆర్థిక వివాదాల్లో స్టేషన్లలోనే కొంతమంది సెటిల్‌మెంట్లు
స్టేషన్ బెయిల్ నుంచి వాహనాల విడుదల వరకు వసూళ్ల పర్వం
ఏసీబీ అరెస్టులతో తేటతెల్లమవుతున్న వ్యవహారం
పోలీసుశాఖకు మచ్చతెస్తున్న కొందరి తీరు
‘మీ మీద ఫిర్యాదు వచ్చింది.. ఒకసారి వచ్చి సార్‌ను కలవండి’ అవతలి వైపు వారు తమ తప్పేమీ లేదని చెబుతున్నా వినిపించు కోకుండానే ‘మీరు వస్తారా? లేక మమ్మల్ని రమ్మంటారా?’ ఇదీ జిల్లాలో కొందరు పోలీసుల తీరు.. అవతలి వైపు వ్యక్తులకు కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించకుండానే కచ్చితంగా స్టేషన్‌కు రావాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో అధికారులు, సిబ్బంది తీరుతో జనం హడలెత్తుతున్నారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌లో మెజారిటీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన కేసులకు సంబంధించి నేరుగా స్టేషన్లలోనే పంచాయితీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత యేడాది కాలంగా ఏసీబీ అధికారుల దాడుల్లో బహిర్గతమవుతున్న సంఘటనలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు పోలీ్‌సస్టేషన్లలో కొందరు అధికారులు దర్జాగా దందాలు చేస్తూ ‘దొరికితేనే దొంగ’ అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని చాలా పోలీస్‌స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసే పేరుతో నేరుగా స్టేషన్ల వద్దకు పిలిపించి బేరాలు మాట్లాడే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు కేసులు మినహా పదుల కొద్దీ కేసుల్లో ఇదే తరహా ధోరణి అవలంభిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వాహనాలకు సంబంధించిన కేసులు, యాక్సిడెంట్ కేసులు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు భరోసాగా నిలుస్తున్నామని చెబుతూ ఇరువర్గాల వారికి సెటిల్‌మెంట్ చేసి రెండు వైపులా అమ్యామ్యాలు అందుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా తమ కార్యాలయాలకు వచ్చిన అనంతరం సదరు వ్యక్తులు తాము న్యాయస్థానం ద్వారా చూసుకుంటామని చెప్పినా.. పట్టించుకోని అధికారులు ముందుగా ‘మానవత్వంతో ఆలోచించండి’ అన్న పదాలను వాడుతూ ఆ తర్వాత మెల్లగా ‘ఎక్కడికి పోతావు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా సెటిల్ చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక మరికొన్ని కేసుల్లో కేసు లేకుండా చేస్తే ఓ లెక్కలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కేసు నమోదు చేసిన తర్వాత వారితో బేరసారాలు కొనసాగించుకుని స్టేషన్ బెయిల్ పొందేందుకు మరో లెక్కన కేసు తీవ్రతను బట్టి రేటు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కిందిస్థాయి సిబ్బందిదే పైచేయి
ఎస్‌హెచ్‌వోలు చేసే సెటిల్‌మెంట్లకు సంబంధించిన వసూళ్ల వ్యవహారం మొత్తం కిందిస్థాయి సిబ్బందే చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా స్టేషన్‌కు వెళ్లే వారితో మాటలు కలపడం నుంచి మొదలుకుని ‘సార్’ని కలిపించడం ఆ తర్వాత బేరం మాట్లాడి ఆయా నగదును వసూలు చేసి తీసుకెళ్లి అప్పజెప్పడం వరకు మొత్తం వారే నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు వారు లేకుండా ఎస్‌హెచ్‌వోలు ఏమీ చేయరన్న భావనలో సైతం ఇంకొందరు సిబ్బంది ఉంటారు. పట్టణ, మండల కేంద్రాలన్న తేడా లేకుండా ప్రతీ స్టేషన్ పరిధిలోనూ ఈ తరహా దందాలు సర్వసాధారణంగా మారినట్టుగా తెలుస్తోంది. కొన్ని స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోల వాహనాల డ్రైవర్లుగా వ్యవహరించేవారు, మరికొన్ని స్టేషన్లలో గన్‌మెన్‌లు, కానిస్టేబుళ్లు, పెద్ద స్టేషన్లలో అయితే రైటర్లు, ఏఎస్‌ఐ స్థాయి వారు సైతం ఇలాంటి తీరును అవలంభిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యవహారాలు సాగించే సమయంలో ఏదైనా తేడా జరిగితే బలిపశువులుగా మారేవారి స్థానంలోనూ వారే ఉంటున్నారు. చాలా సందర్భాల్లో అలాంటి ఆరోపణలు ఎదుర్కొని బదిలీలు, సస్పెన్షన్లు అయిన సంఘటనలు ఉమ్మడి ఖమ్మంలో బోలెడన్ని ఉన్నాయి. కాగా ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన వారిలో కూడా వారే కీలకంగా ఉండటం కొసమెరుపు. ఒకరిద్దరు డివిజన్‌స్థాయి అధికారులకు సైతం ఇలాంటి దందాల్లో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరుగా జిల్లా బాస్‌ల పేర్లు చెప్పి తమదైన శైలిలో పంచాయతీలకు దిగుతున్నారంటే ఏ తరహాలో దందాలు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల కాలంలో ఏసీబీకి దొరికిన కేసులు
ఖమ్మం నగరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్లో ఓ కేసులో 41సీఆర్‌పీసీ నోటీసు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించినా లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావును ఏసీబీ పోలీసులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
పాల్వంచ పట్టణ ఎస్‌ఐ బి.రాము ఓ ఆర్థిక వివాదానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. చార్జీషీటు ఫైల్ చేసేందుకుగాను బాధితురాలైన ఓ మహిళను రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించింది.
భద్రాచలం సీఐ బరపాటి రమేష్, గన్‌మెన్ రామారావును ఏసీబీ అధికారులు ఓ లంచం కేసులో అరెస్టు చేశారు. గ్రావెల్ లారీని వదిలిపెట్టేందుకు రూ.20వేలు లంచం తీసుకున్న ఘటనలో వారిపై కేసు నమోదు చేశారు.
మణుగూరు సీఐ సోమ సతీష్‌కుమార్‌ను ఓ భూ వివాదం ఘటనలో కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.4లక్షలు డిమాండ్ చేసి మధ్యవర్తి ద్వారా రూ.లక్ష తీసుకున్న ఘటనలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ
Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి
Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్!
Read Latest Telangana News And Telugu News