Seethakka: రిజర్వేషన్లపై కేటీఆర్ కామెంట్స్.. సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:26 PM
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్‌ఎస్ అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 27: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ (Former Minister KTR) వ్యాఖ్యలకు మంత్రి సీతక్క (Minister Seethakka) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ప్రచారం చేస్తున్నట్లుగా బీసీల రిజర్వేషన్‌లు ఎక్కడా తగ్గలేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి గొంతు కోసిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని.. కానీ 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిందని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించి తడిబట్టతో బీసీల గొంతు కోసింది బీఆర్‌ఎస్ అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు.
అబద్దాలకు అంబాసిడర్‌గా మారి కేటీఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీసీలు విశ్వసించరని తెలిపారు. గత స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్‌గా సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేశారని.. కానీ ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు. సర్పంచుల రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్రం యూనిట్‌గా కాకుండా మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. అందుకోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా చెప్పిందని సుప్రీం తీర్పును మంత్రి గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, దాని సిఫార్సు మేరకు మండలం యూనిట్‌గా సర్పంచుల రిజర్వేషన్ల నిర్ణయం జరిగిందన్నారు.
ఆయా మండలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాను బట్టి సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయని తెలిపారు. అందుకే కొన్ని మండలాల్లో రిజర్వేషన్లు పెరిగినట్లుగా, మరికొన్ని మండలాల్లో తగ్గినట్లుగా పైకి కనిపిస్తున్నా, స్టేట్ యూనిట్‌గా చూస్తే ఎక్కడా రిజర్వేషన్లు తగ్గలేదని వెల్లడించారు. ఏ మండలంలో కూడా రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. రిజర్వేషన్ల ఖరారులో సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేశామని వివరించారు. సుప్రీం తీర్పును అపహాస్యం చేసినట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుల గణన చేపట్టి పక్కాగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు.
కుల గణనలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం, బీసీ రిజర్వేషన్లపై సన్నాయి నొక్కులు నొక్కుతోందని వ్యాఖ్యలు చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని... అందుకోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని.. జంతర్ మంతర్‌లో స్వయంగా సీఎం నేతృత్వంలో ధర్నా చేపట్టామని మంత్రి అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, కాంగ్రెస్‌ను విమర్శిస్తూ బీజేపీ బీ టీంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు. బీసీలకు 42 శాతం సీట్లు బీఆర్‌ఎస్ ఇస్తుందా లేదా చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News