Share News

Telangana High Court: సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:00 PM

సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బాధ్యులెవరినీ గుర్తించలేదా అంటూ సీజే సీరియస్ అయ్యారు.

Telangana High Court: సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
Telangana High Court

హైదరాబాద్, నవంబర్ 27: సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగాచీ పేలుళ్లపై దాఖలైన పిల్‌పై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన కాదని, 54 మంది కార్మికులు చనిపోయారన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డిని సీజే ప్రశ్నించారు. 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులెవరని తేల్చలేదా అని ప్రశ్నించారు.


ఇంత పెద్ద ఘటన జరిగితే డీఎస్పీని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని ఏఏజీని సీజే నిలదీశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అని సీజే ప్రశ్నించారు. కాగా.. సిగాచీ పేలుళ్లపై బాబు రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పేలుడు సంభవించి 5 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని న్యాయవాది వసుధా వాదనలు వినిపించారు. నిపుణల కమిటీ కూడా పరిశ్రమల నిర్వహణలో లోపాలున్నాయని తేల్చిందన్నారు.


నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారని కమిటీ గుర్తించిందని లాయర్ వెల్లడించారు. పేలుడు తీవ్రతకు 8 మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని న్యాయవాది వసుధా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏఏజీ తేరా రజినీకాంత్ కోర్టుకు తెలిపారు. దీంతో పోలీసు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి డీఎస్పీ కోర్టు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ హైకోర్టు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి...

గ్రూప్‌ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

మరోసారి కస్టడీకి ఐబొమ్మ రవి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 27 , 2025 | 04:28 PM