Share News

MLC Kavitha: కర్మ హిట్స్ బ్యాక్ ట్వీట్‌పై స్పందించిన కవిత..

ABN , Publish Date - Nov 16 , 2025 | 03:33 PM

కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జై తెలంగాణ అంటూ కవిత సమాధానమిచ్చారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన వాటి ఆధారంగానే తాను ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

MLC Kavitha: కర్మ హిట్స్ బ్యాక్ ట్వీట్‌పై స్పందించిన కవిత..
MLC Kavitha

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్, బీజేపీలకు గట్టి షాక్ ఇచ్చాయి. బీఆర్ఎస్ నేతలైతే గెలుపు తమదే అంటూ గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ, ఫలితం వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలంతా షాక్‌కు గురయ్యారు. సిట్టింగ్ స్థానం తమదే అనుకుని ఎంతో ధీమాతో ఉన్నవారికి ప్రజా తీర్పు మింగుడు పడడం లేదు. అయితే, ఫలితాల రోజు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె చేసిన ట్వీట్.. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ పోస్టు పెట్టారనేది బహిరంగ రహస్యమే అయినా దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే, తాజాగా కవిత ఆ పోస్టుపై స్పందించారు.


కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జై తెలంగాణ అంటూ కవిత సమాధానమిచ్చారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన వాటి ఆధారంగానే తాను ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. తాను ఏసీ రూమ్‌లో కూర్చొని మాట్లాడడం లేదని.. తన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ వివరణ ఇచ్చినందుకు సంతోషమని అన్నారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ సైతం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగతా వాళ్లూ ఈ ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు. నక్కలగండి ప్రాజెక్టు వ్యవహారంపై జాగృతి చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గిందని చెప్పుకొచ్చారు. తనపై బీఆర్ఎస్ వాళ్లు చేసే కామెంట్లకు జాగృతి కార్యకర్తలు కౌంటర్ చేస్తారని హెచ్చరించారు.


బాధ్యత గల ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే వివరణ ఇవ్వాలే తప్ప ఎదురుదాడికి దిగడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి అనుకూలంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసలు రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చిందే బీఆర్ఎస్ వాళ్లని ఆగ్రహించారు. ఏ పార్టీ కూడా ఆడవాళ్లకు న్యాయం చేయడం లేదని.. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం మహిళలే ధర్నాలు చేశారని కవిత ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని పక్కనపెట్టి ప్రియాంక గాంధీకి న్యాయం చేయమని ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడగలరా? అని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తన పాత్ర ఏమీ లేదని.. తాను ప్రేక్షకపాత్ర మాత్రమే వహించినట్లు చెప్పుకొచ్చారు కవిత.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్‌ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ

Updated Date - Nov 16 , 2025 | 04:15 PM