Malnadu Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:45 PM
Malnadu Drugs Case: రాహుల్ తేజ్ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2024 జనవరిలో డిచ్‌పల్లిలో రాహుల్ తేజ్‌పై డ్రగ్స్ కేస్ నమోదు అయ్యింది.

హైదరాబాద్, జులై 16: సంచలనం సృష్టిస్తోన్న మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో (Malnadu Drugs Case) నిందితులను మూడో రోజు విచారిస్తోంది ఈగల్ టీం. నిందితుల కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్నాడు డ్రగ్స్ దందాలో సీనియర్ పోలీస్ అధికారుల కుమారులు రాహుల్ తేజ్, మోహన్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నైజీరియన్ జెర్రీ దగ్గర ఏఆర్ డీసీపీ సంజీవరావు కుమారుడు మోహన్ డ్రగ్స్ కొనుగోలు చేసి సూర్యకు ఇచ్చినట్లు విచారణలో తెలిపారు. రాహుల్ తేజ్‌పై గతంలో కూడా డ్రగ్స్ ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రాహుల్ తేజ్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో పలుమార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు బయటపడింది.
మరోవైపు రాహుల్ తేజ్ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2024 జనవరిలో డిచ్‌పల్లిలో రాహుల్ తేజ్‌పై డ్రగ్స్ కేస్ నమోదు అయ్యింది. ఆ కేసులో విచారించేందుకు డిచ్‌పల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్‌లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్‌ను రాహుల్ తేజ్ హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు విచారణలో బయటపడింది. రేపటి (గురువారం) వరకు నిందితుల కస్టడీ విచారణ కొనసాగనుంది. నాలుగు రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమితి ఇచ్చిన నేపథ్యంలో రేపటితో కస్టడీ గడువు ముగియనుంది. తిరిగి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి ఆపై చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు ఈగల్ టీం. మల్నాడు డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే
సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు
Read Latest Telangana News And Telugu News