Share News

Govt Schools: సర్కారు బడికి జై.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల జోరు

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:05 PM

జిల్లాలో 1,342 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1,40,171 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌తోపాటు డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు.

Govt Schools: సర్కారు బడికి జై.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల జోరు

- బడిబాటలో 36,579 మంది విద్యార్థుల చేరిక

- మెరుగైన సౌకర్యాలు.. ఉత్తమ బోధన

- ఇంగ్లిష్‌ మీడియంలో తరగతులు

- ఆకర్షితులవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన

సౌకర్యాలు, ఉత్తమ బోధన అందిస్తుండడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అడ్మిషన్లు జోరుగా పెరిగాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను, డ్రాపౌట్‌ పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఈసారి 36,579 కొత్తగా అడ్మిషన్లు జరిగాయి. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.

రంగారెడ్డి అర్బన్‌: జిల్లాలో 1,342 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1,40,171 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌తోపాటు డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, స్కూల్‌ డ్రెస్‌, మధ్యాహ్న భోజనం, బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు వంటి అనేక రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.


దీనికి తోడు బడిబాటలో సర్కారు బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధనపై విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో ఈ ఏడాది మొత్తం 36,579 కొత్త అడ్మిషన్లు జరిగాయి. ఇందులో ఒకటో తరగతిలో 8,203, రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రైవేట్‌ బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి 15,222, ప్రాథమిక, ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలల్లో 13,154 మంది చేరారు. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లలను దగ్గరలో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించారు. విద్యార్థులకు టెక్ట్‌బుక్స్‌, నోట్‌ బుక్స్‌, యూనిపామ్స్‌ అందజేశారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఆరు పాఠశాలల్లో రెట్టింపు స్థాయిలో..

జిల్లాలోని ఆరు పాఠశాలల్లో అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో విద్యార్థులు చేరారు. ఆరుట్ల పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉండగా.. బడిబాటలో 1,400 మంది వరకు చేరారు. శంషాబాద్‌ మండలం ముచ్చర్ల బడిలో 78 మంది ఉంటే.. వీరి సంఖ్య 1,113కి చేరుకుంది. వేయి మందికిపైగా విద్యార్థులు అడ్మిషన్‌ పొందారు. ఫరూక్‌నగర్‌ మండలంలో 600 మంది పిల్లలు చేరారు. సింగరేణి కాలనీలోని బడిలో 25 మంది విద్యార్థులు ఎంఈవో సహకారంతో చేర్పించారు. మహేశ్వరం మండలం కోళ్లపడకల్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 23, ఉన్నత పాఠశాలలో 35 మంది చేరారు. కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో పీఎ్‌సలో 20, హైస్కూల్లో 20 మంది చేరారు. శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి రవాణ సౌకర్యం కల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. మంచాల మండలం ఎల్లమ్మ తండా స్కూల్‌ మూత పడింది. ఈ స్కూల్‌ను రీఓపెన్‌ చేయించారు. ఇందులో 66మంది పిల్లలు చేరారు.


అడ్మిషన్లు పెరిగాయి

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నాం. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుతోంది. బడిబాట కార్యక్రమంలో 36,579 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు అడ్మిషన్లు తీసుకున్నారు.

- సుశీంద్రరావు, జిల్లా విద్యాధికారి


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 16 , 2025 | 12:05 PM