BRS Vs Congress: మీ మౌనం దేనికి సంకేతం.. రాహుల్‌కు కవిత సూటి ప్రశ్న
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:05 AM
BRS Vs Congress: రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. మీ మౌనం దేనికి సంకేతం అంటూ కవిత క్వశ్చన్ చేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (AICC Leader Rahul Gandhi) హైదరాబాద్ పర్యటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కవిత పలు ప్రశ్నలు సంధించారు. దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారంటూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా, మూసీ పేరుతో ప్రజల మీదికి బుల్డోజర్లు పంపిందని.. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందంటూ ఫైర్ అయ్యారు. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్దారించిందని తెలిపారు. కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు.. వేధింపులు.. బెదిరింపులకు గురిచేశారన్నారు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు, అక్రమ కేసులు, అరెస్టులతో ఇబ్బందులకు గురిచేశారన్నారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని, ప్రియాంకా గాంధీని, రాహుల్ గాంధీని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు.
Flight Emergency: ప్రయాణికుడికి అస్వస్థత.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
బీహార్‌లో గ్రూప్ -1 బాధితుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన మీరు.. తెలంగాణలో గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికే పరిమితం చేశారని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని... అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయరెందుకని ప్రశ్నించారు. ‘కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? మహిళలకు నెలకు రూ.2500 ఏమయ్యాయి? 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు ? ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంటకలుపుతూ.. దమనకాండ కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.. ? మీ మౌనం దేనికి సంకేతం?’ అంటూ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎంపీ మల్లు రవి కౌంటర్
కాగా.. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించిన ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ రాకను వ్యతిరేకించడాన్ని ఖండించారు. కేసీఆర్ ఫ్యామిలీ రాహుల్ రాకపై ఆందోళన చెందుతున్నారన్నారు. బీసీ కులగణన చేసినందుకే రాహుల్ రాకను వ్యతిరేకిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతున్నారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Liquor Scam: సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్న సిట్
Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
Read Latest Telangana News And Telugu News