Share News

Chaderghat case: చాదర్‌ఘాట్‌ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం..

ABN , Publish Date - Oct 26 , 2025 | 10:32 AM

చాదర్‌ఘాట్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఇద్దరు స్నాచర్లు సెల్‌ఫోన్లు కొట్టేసేందుకు యత్నించిగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మొబైల్ స్నాచింగ్ చేసి పారిపోతున్న మహమ్మద్ అమీర్ అన్సారీ.. ఎదురుతిరిగి గన్‌మెన్ సత్యనారాయణ మూర్తిపై కత్తితో దాడి చేశాడు.

Chaderghat case: చాదర్‌ఘాట్‌ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం..
Hyderabad firing case

హైదరాబాద్: చాదర్‌ఘాట్‌ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ(ఆదివారం) మరోసారి ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఫోరెన్సిక్ టీమ్‌తో క్లూస్ సేకరిస్తున్నారు. కాల్పుల ఘటన కేసులో Bns 304, 109, 132 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు. డీసీపీ చైతన్యకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల్లో మహమ్మద్ ఒమర్‌ అన్సారీ చికిత్సపొందుతుండగా.. మరో దొంగ పరారీలో ఉన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరోవైపు నిందితుడు మహమ్మద్ ఒమర్‌ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


అయితే.. చాదర్‌ఘాట్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఇద్దరు స్నాచర్లు సెల్‌ఫోన్లు కొట్టేసేందుకు యత్నించిగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మొబైల్ స్నాచింగ్ చేసి పారిపోతున్న మహమ్మద్ ఒమర్‌ అన్సారీ.. ఎదురుతిరిగి గన్‌మెన్ సత్యనారాయణ మూర్తిపై కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన సౌత్‌ఈస్ట్‌ డీసీపీ చైతన్యకుమార్‌ తన దగ్గర ఉన్న గన్‌తో అన్సారీపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక తూటా భుజంపై, మరొకటి ఛాతీ భాగంలో తగలటంతో అన్సారీ కిందపడిపోయాడు. దీంతో వెంటనే అన్సారీని.. అలాగే గాయపడిన డీసీపీని, గన్‌మెన్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు.


కాగా, ఇవాళ(ఆదివారం) డీసీపీ చైతన్య, గన్‌మెన్‌ సత్యనారాయణమూర్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒమర్‌ అన్సారీకి చికిత్స కొనసాగుతోంది. అయితే.. ఇప్పటికే అన్సారీపై 20 కేసులు, రెండు సార్లు పీడీ యాక్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటివలే రెండేళ్లు జైలుకెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత తన కార్యకలాపాలపై ఫోకస్ పెట్టినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ అన్సారీకి శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated Date - Oct 26 , 2025 | 03:22 PM