Fire Accident: గోమతి ఎలక్ట్రానిక్స్‌లో అగ్నిప్రమాదం ఘటన.. వెలుగులోకి కొత్త విషయాలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:23 AM
గోమతి ఎలక్ట్రానిక్స్‌లో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 25: నగరంలోని పాతబస్తీ శాలిబండలో గోమతి ఎలక్ట్రానిక్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. షాపులోని ఎలక్ట్రానిక్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు వెళ్లి గోమతి ఎలక్ట్రానిక్ షాప్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కారు డ్రైవర్‌ను మొగల్‌పురా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రమాదానికి గురైన కారు నెంబర్ TG07V8483గా గుర్తించారు. కారు డ్రైవర్ మణికంఠను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కారు బ్లాస్ట్ కావడంతో ఉగ్రవాద చర్యగా భావించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉగ్ర కుట్ర కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో చనిపోయింది కారు డ్రైవర్ కాదని పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది.
ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు..
కాగా.. గత రాత్రి 10:25 గంటలకు జరిగిన ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణమైన కారు చార్మినార్ నుంచి లాల్‌దర్వాజా వెళుతూ ఒక్కసారిగా గోమతి షాపును ఢీకొట్టిందని.. కారులో ఉన్న ఏసీ కంప్రెజర్ పేలి మంటలు షాపుకు అంటుకున్నాయని, అక్కడ షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి ప్రమాదం జరిగిందనేది ఒక వాదన. షాపులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు బయటకు వ్యాప్తి చెందాయని.. ఈ సమయంలో అటుగా వెళ్తున్న కారుకు మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఇంత ప్రమాదం జరిగింది అంటూ రెండు భిన్న కోణాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎందువల్ల జరిగింది?.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...
Read Latest Telangana News And Telugu News