Kidney Racket Case: తెలంగాణ కిడ్నీ రాకెట్ కేసు.. కీలక సూత్రధారుల అరెస్ట్
ABN , Publish Date - May 29 , 2025 | 09:01 PM
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసు(Telangana Kidney Racket Case) పెను దుమారం సృష్టిస్తోంది. ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ కేసును సీఐడీ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. ఈ దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరిని ఇవాళ (గురువారం) అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో పరారీలో మరో ఏడుగురు నిందితులు ఉన్నారు. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.
గతంలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేస్ సీఐడీకి బదిలీ అయిన తర్వాత ఇద్దరినీ తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్య అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి దగ్గరి నుంచి పాస్‌పోర్ట్‌తో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో అదుపులోకి తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్‌కు తరలించారు. తమిళనాడులో పేదవారిని టార్గెట్ చేసి కిడ్నీ డొనేట్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ. 10 లక్షలమేర నిందితులు వసూలు చేశారు. కిడ్నీ డొనేట్ చేసిన వారికి నిందితులు రూ.4 లక్షలు చెల్లించినట్లు అధికారుల విచారణలో తేలింది.
కాగా, అలకనంద ఆస్పత్రిలో జరిగే కిడ్నీ ఆపరేషన్లపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై సంబంధిత ఆస్పత్రి యాజమాన్యాన్ని సీఐడీ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. దర్యాప్తు ముమ్మరంగా జరుపుతున్న కొద్దీ ఈ రాకెట్‌కు దేశవ్యాప్తంగా ఉన్న లింకులు బయటపడుతున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు.
సీఐడీ అధికారులు ఇప్పటికే సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. నిందితుల మొబైల్ ఫోన్లు, వాటిలోని వాట్సాప్ చాట్స్, బ్యాంకు లావాదేవీలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు. ఇదే క్రమంలో పాసుపోర్టులను, విదేశీ కాల్‌లాగ్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఏ ఒక్క నిందితుడు తప్పించుకోలేనంతగా ఫోరెన్సిక్ ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News