Share News

KTR : సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..

ABN , Publish Date - Jul 16 , 2025 | 07:26 PM

తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.

KTR : సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..
BRS Working President KTR

హైదరాబాద్, జులై 16: న్యూఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తన ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం స్పందించారు. ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయ్యిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి అన్నారు. తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు.. బూడిద తెలంగాణ ప్రజలకి! అని తెలిపారు.

బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి…. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు…. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అంటూ సీఎం రేవంత్ ‌రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.


కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో…ఈ రోజుతో తేలిపోయిందని స్పష్టం చేశారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి.. తెలంగాణ విధ్వంసం కావలసిందేనా? అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి.. చెరిపేయి సరిహద్దులు! అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో! జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో!.. ఒక్క మాట గుర్తు పెట్టుకో.. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం! ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పక పడతామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు.


హరీష్ రావు స్పందిస్తూ..

ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌లో స్పందించారు. తెలంగాణలో రేవంత్ + కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని వ్యంగ్యంగా అన్నారు. బనకచర్ల ప్రాజక్ట్‌పై కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవటం తెలంగాణకు ద్రోహం చేయటమేనని పేర్కొన్నారు. కమిటీ రిపోర్ట్‌కు ఒప్పుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం దుర్మార్గమని తెలిపారు. బనకచర్ల ప్రాజక్టును ఒప్పుకునే ప్రసక్తే బీఆర్ఎస్‌ పార్టీకి లేదని ఈ సందర్భంగా హరీష్ రావు కుండ బద్దలు కొట్టారు. బనకచర్ల నిర్మించాలని కమిటీ చెప్తే సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.


రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి.. చంద్రబాబు ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఈ సీఎంల సమావేశంలో జరిగింది జరిగినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హరీష్ రావు థ్యాంక్స్ చెప్పారు. బనకచర్లపై చర్చ జరిగిందని ఏపీ మంత్రి నిమ్మల చెప్తే.. జరగ లేదని సీఎం రేవంత్ రెడ్డి చె బుతున్నాడని విమర్శించారు. ఈ అంశంపై సమావేశం పెట్టడమే కేంద్రం చేసిన తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనటం‌ మరొక తప్పు అని పేర్కొన్నారు. మీటింగ్‌కు వెళ్ళనని.. ఎందుకు వెళ్ళాడో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఒత్తిడి పని చేసిందా? బాబు ఒత్తిడి పని చేసిందా అనే విషయాన్ని బహిర్గతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఉదయం బాయ్ కాట్ అంటాడు.. సాయంత్రం బాయ్ బాయ్ రాజకీయాలు చేస్తాడంటూ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు.


అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పట్టుపట్ట లేదని సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పేరుకు రేవంత్ రెడ్డి పాలన.. ఆచరణలో మాత్రం చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని అభివర్ణించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అబద్దాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సాగు నీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన వారిని సలహాదారుగా పెట్టుకోవటం ఏంటంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన అంశాలివే ..!

డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిన జగన్: వర్ల రామయ్య

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 08:10 PM