Share News

AV Infra Fraud Case: బీ కేర్ ఫుల్.. పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం.. ఎన్ని కోట్లు వసూల్ చేశారంటే..

ABN , Publish Date - Jun 21 , 2025 | 05:34 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌ని కేంద్రంగా చేసుకొని ఏపీ ఇన్‌ఫ్రా పేరిట కంపెనీని విజయ్ గోగుల అనే వ్యక్తి నిర్వహించాడు. వందలాది మంది పెట్టుబడిదారులని ఆకర్షించి అధిక లాభాల ఆశ చూపి ఈ మోసానికి ఆయన పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

AV Infra Fraud Case: బీ కేర్ ఫుల్.. పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం.. ఎన్ని కోట్లు వసూల్ చేశారంటే..
AV Infra Fraud Case

హైదరాబాద్‌: మాదాపూర్‌లో ఏవీ ఇన్‌ఫ్రా పేరిట భారీ మోసం (AV Infra Fraud Case) వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి‌లోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ దందా బయటకు వచ్చింది. ఇవాళ(శనివారం) ఇందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. మాదాపూర్ కేంద్రంగా బై బ్యాక్ పేరుతో పైసలను ఏవీ ఇన్‌ఫ్రా చైర్మన్ విజయ్ గోగుల వసూల్ చేశాడు. ఏవీ ఇన్‌ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికీ డబుల్ అమౌంట్ ఇస్తామని, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో వెంచర్‌లు అంటూ విజయ్ గోగుల నమ్మించాడు. 18 నెలలకు 50శాతం అదనంగా ఇస్తానని చెప్పి చివరికి విజయ్ గోగుల చేతులెత్తేశాడు.


తీరా బాధితులు అడిగే సరికి 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉందని.. అక్కడ ఇస్తాను అంటూ దాటవేశాడు. బాధితులు గట్టిగా అడిగితే బ్లాంక్ చెక్‌లు ఇస్తూ తప్పించుకొని విజయ్ గోగుల తిరుగుతున్నాడు. మాదాపూర్ దుర్గం చెరువు దగ్గర ఏవీ ఇన్‌ఫ్రా కార్యాలయం కేంద్రంగా ఈ దందా జరిగింది. సుమారుగా 500 మంది వరకు బాధితులు మోసపోయారు. రూ.500 కోట్ల వరకు ఏవీ ఇన్‌ఫ్రా మోసానికి పాల్పడింది. రూ.84 లక్షల వరకు రాజు అనే వృద్ధుడు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అయితే తన డబ్బులు వస్తాయో రావోనని తీవ్ర ఆందోళనకు ఆయన గురయ్యాడు.


బాధితుల ఫిర్యాదుతో ఏవీ ఇన్‌ఫ్రా చైర్మన్ విజయ్ గోగులపై మాదాపూర్ పోలీసు స్టేషన్‌‌లో కేసు నమోదు చేశారు. విజయ్ గోగులపై గతంలోనూ ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విజయ్ గోగుల కాల్ డేటాను, బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని.. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

సిట్‌ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యా‌ప్‌పైనే విచారణ

యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి

భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 05:56 PM