Share News

CM Revanth Reddy: క్రీడా వర్సిటీకి సహకరించండి

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:19 AM

తెలంగాణలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు విజ్ఞప్తి చేశారు.

CM Revanth Reddy: క్రీడా  వర్సిటీకి సహకరించండి

ఖేలో ఇండియా గేమ్స్‌ను తెలంగాణలో నిర్వహించండి.. క్రీడా వసతులకు 100 కోట్లు ఇవ్వండి

  • ఒలింపిక్స్‌-2036లో 2 ఈవెంట్లు రాష్ట్రంలో జరపండి

  • క్రీడాకారులకు రైల్‌ చార్జీల్లో రాయితీ పునరుద్ధరించండి

  • కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి

  • సీఎం రేవంత్‌తో కపిల్‌ దేవ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ భేటీ

  • తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధిపై కపిల్‌ ప్రశంస

  • రాష్ట్రంలో ఫిల్మ్‌ స్టూడియా నిర్మిస్తానన్న అజయ్‌ దేవ్‌గణ్‌

  • ఈ నెల 10న సమావేశం కానున్న రాష్ట్ర క్యాబినెట్‌

  • బనకచర్ల, ‘స్థానికం’, యువ వికాసంపై చర్చించే చాన్స్‌

న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ను తెలంగాణలో నిర్వహించాలని, దాంతోపాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం తెలంగాణకు కల్పించాలని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన అధికారిక నివాసంలో రేవంత్‌ కలిశారు. ఖేలో ఇండియా కింద క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, క్రీడా నిపుణుల ఎంపిక, ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. భువనగిరిలో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌, మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్‌ పూల్‌, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ల నిర్మాణాలు, కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్‌ హాల్‌, హైదరాబాద్‌ హకీంపేట్‌లో అర్చరీ రేంజ్‌, సింథటిక్‌ హాకీ ఫీల్‌ ఎల్‌బీ స్టేడియంలో స్క్వాష్‌ కోర్టు, నేచురల్‌ ఫుట్‌బాల్‌ ఫీల్‌ ్డ అభివృద్ధి, సింథటిక్‌ ట్రాక్‌, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్‌ నవీకరణకు రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. క్రీడా వసతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నివిధాలా కృషి చేస్తోందని, కేంద్రం సైతం తమ వంతు సహకారం అందించాలని కోరారు. 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్‌లో కనీసం రెండు ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైల్వే టికెట్లలో రాయితీ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్‌ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.

2.jpg


క్రీడారంగం అభివృద్ధిపై కపిల్‌దేవ్‌ ప్రశంస..

తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ప్రశంసించారు. సోమవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కపిల్‌ దేవ్‌ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కపిల్‌దేవ్‌కు సీఎం రేవంత్‌ వివరించారు. దీంతో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీతోపాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తాను భాగస్వామినవుతానని కపిల్‌దేవ్‌ అన్నారు. కాగా, దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో తాము సందర్శించిన క్రీడా యూనివర్సిటీలు, అక్కడి క్రీడా ప్రముఖులతో తమ భేటీల వివరాలను కపిల్‌దేవ్‌కు సీఎం వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.


తెలంగాణలో అజయ్‌ దేవ్‌గణ్‌ ఫిల్మ్‌ స్టూడియో..

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్‌ స్టూడియో ఏర్పాటు చేస్తానని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అన్నారు. ఇందుకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఢిల్లీలో సీఎంను ఆయన నివాసంలో అజయ్‌ దేవ్‌గణ్‌ కలిశారు. ఈ సందర్భంగా సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్‌, వీఎ్‌ఫఎక్స్‌ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో తెలంగాణలో ఏర్పాటు చేస్తానన్నారు. స్టూడియో నిర్మాణంతోపాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకూ ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని సీఎంకు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి మంగళవారం కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అశ్వినీ వైష్ణవ్‌, జేపీ నడ్డాలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 03:19 AM