Share News

CM Revanth Reddy: రాహుల్‌తో కలిసి ప్రధాని వద్దకు!

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:42 AM

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని ప్రధాని మోదీని కోరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది.

CM Revanth Reddy: రాహుల్‌తో కలిసి ప్రధాని వద్దకు!

బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని మోదీని కోరనున్న సీఎం రేవంత్‌

  • మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం యత్నం

  • బీసీ బిల్లుల అంశంపై పార్లమెంటులో చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయం

  • రిజర్వేషన్ల పెంపుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

  • ఇందుకోసం రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి

  • కార్యాచరణపై భట్టి, ఉత్తమ్‌లతో భేటీ

  • బీసీ బిల్లులతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల సమీకరణపైనా చర్చ

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్ర‌జ్యోతి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని ప్రధాని మోదీని కోరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో కలిసి వెళ్లి మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. తెలంగాణలో చేపట్టిన కులగణన, అందులో వెల్లడైన వివరాలు, అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలిసింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఆమోదించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యుల్‌లో చేర్చాలంటూ కేంద్రానికి పంపిన బిల్లులపై పార్లమెంటులో చర్చ పెట్టించి, ఆమోదింపజేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఇండియా కూటమి మద్దతు కూడగట్టాలని సీఎం రేవంత్‌ నిర్ణయించారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్రంపై అన్ని వైపుల నుంచీ ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వీలుగా ఇండియా కూటమి ఎంపీలకు.. తెలంగాణలో కులగణన వివరాలు, రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకత, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిన బిల్లులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌.. రెండు, మూడు రోజులు అక్కడే ఉండనున్నారు.


రాహుల్‌, సీఎంతో కలసి ప్రధానితో భేటీ అవుతాం: ఎంపీ చామల

తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించి, కేంద్రానికి పంపిన బిల్లులపై లోక్‌సభలో గళం విప్పుతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో ఇండి కూటమి ఎంపీలందరి మద్దతు కూడగడతామని తెలిపారు. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో రాహుల్‌గాంధీతో చర్చిస్తారని, ఇండి కూటమి ఎంపీలతోనూ ప్రత్యేకంగా మాట్లాడతారని వెల్లడించారు. రాహుల్‌, రేవంత్‌, భట్టిలతో వెళ్లి మోదీని కలుస్తామని, రాజకీయాలను పక్కనపెట్టి బిల్లులను ఆమోదించాలని కోరుతామని చామల తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీల విషయంలో సానుకూలంగానే వ్యవహరిస్తున్నారని.. బీసీ బిల్లుల విషయంలోనూ సానుకూలంగానే ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. మెట్రో రెండోదశ విస్తరణ, రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తరభాగం పనులు వేగవంతం చేయడంతోపాటు, మూసీ పునరుజ్జీవనానికి నిధులు ఇవ్వాలని పార్లమెంటులో డిమాండ్‌ చేయనున్నట్టు తెలిపారు.


భట్టి, ఉత్తమ్‌లతో సీఎం భేటీ

అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లుల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌లతో సీఎం రేవంత్‌ భేటీ అయి చర్చించారు. ఆదివారం సాయంత్రం సీఎం నివాసంలో సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో బీసీ బిల్లుల ఆమోదానికి ఉన్న ప్రాముఖ్యత, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన వివరాలు, స్వతంత్ర నిపుణుల కమిటీ అధ్యయనం చేసి చెప్పిన ఫలితాలను కేంద్రానికి వివరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే ఈ అంశంపై రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలతో భేటీకావాలని నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వనరుల సమీకరణ తదితర అంశాలపైనా చర్చించినట్టు తెలిసింది.


రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.కోటి నజరానా!

  • గాయకుడికి నగదు పురస్కారాన్ని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి

    6.jpg

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): స్వయంకృషితో ఎదిగిన పాతబస్తీ కుర్రోడు.. ప్రముఖ గాయకుడు.. రాహుల్‌ సిప్లిగంజ్‌కు తెలంగాణ సర్కారు రూ.కోటి నజరానా ప్రకటించింది. పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌కు నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్‌ ప్రస్థానం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు.. నాటు..’ పాట పాడడం ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ పాటకు ఆస్కార్‌ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రూ.కోటి నగదు పురస్కారం అందిస్తామనీ చెప్పారు. ఇటీవల గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ఓల్డ్‌ సిటీ నుంచి ఆస్కార్‌ దాకా వెళ్లిన కుర్రోడు’ అంటూ రాహుల్‌ను కొనియాడారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్‌.. తెలంగాణ యువతకు మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఆయనకు అందించే పురస్కారంపై త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్‌కు రూ.కోటి నజరానాను ప్రకటించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 03:42 AM