Share News

CM Revanth Reddy: నాడు బేడీలు.. నేడు వెలుగులు

ABN , Publish Date - May 20 , 2025 | 03:44 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు బేడీలు వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు అదే పోడు రైతులకు తాము భూములు పంచడమే కాకుండా..

CM Revanth Reddy: నాడు బేడీలు.. నేడు వెలుగులు

  • బీఆర్‌ఎస్‌ హయాంలో పోడు భూములివ్వమంటే దాడులు

  • మేం భూములు పంచడమే కాక ఉచిత సోలార్‌ పంపుసెట్లు ఇస్తున్నాం

  • కడుపు నిండా విషం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు

  • లబ్ధిదారులకు గుర్తుంటే చాలు.. సోషల్‌ మీడియా సన్నాసులు లెక్కేకాదు

  • రూ.12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు

  • ఇందిర సౌర గిరి జలవికాసం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • నాగర్‌కర్నూల్‌ జిల్లా మాచారంలో జలవికాసం పథకం ప్రారంభం

  • మంత్రులతో కలిసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం

  • ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు.. పట్టువస్త్రాల సమర్పణ

మహబూబ్‌నగర్‌/నాగర్‌కర్నూల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు బేడీలు వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు అదే పోడు రైతులకు తాము భూములు పంచడమే కాకుండా.. ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ఇచ్చి పండ్లతోటలు పెంచే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.12,600 కోట్లతో ఇందిర సౌర గిరి జలవికాసం పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్‌ మండలంలోని మాచారంలో ఈ పఽథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 27 మంది రైతుల పండ్ల తోటలకు ఏర్పాటు చేసిన స్ర్పింక్లర్లను స్విచ్చాన్‌ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో 2.70 లక్షల మంది రైతులకు ఇందిర సౌర గిరి జలవికాసం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇదే కాకుండా అచ్చంపేట నియోజకవర్గంలో వచ్చే వంద రోజుల్లో విద్యుత్‌ మోటార్లను తొలగించి కేవలం సోలార్‌ ఆధారిత పంపు సెట్లు వందశాతం బిగించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే కొత్తగా వచ్చిన ఐఏఎ్‌సను డిప్యుటేషన్‌ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ పథకం లబ్ధిదారుల్లో డిగ్రీ చదివిన వారిని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శిక్షణ ఇచ్చేందుకు పంపించాలని, వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని అన్నారు. సోలార్‌ పంపుసెట్లను రైతులు బిగించుకోవాలంటే వారికి సాగు కోసమే కాకుండా సోలార్‌ విద్యుత్‌ అదనపు ఉత్పత్తి ద్వారా నెలకు రూ.5 వేల వరకు ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిర సౌర గిరి జలపథకాన్ని నల్లమల డిక్లరేషన్‌గా పేర్కొని.. ఈ పథకం కింద చేసే పనుల డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు.


వరి వేస్తే ఉరి అన్నారు..

గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని చెప్పి.. ఫాంహౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి వేసుకొని క్వింటా రూ.4200కు విక్రయించారని సీఎం రేవంత్‌ అన్నారు. తాము మాత్రం సన్నవడ్లకు బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు గత వానాకాలంలో 1.56 కోట్ల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 1.35 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించారని చెప్పారు. 16 నెలల కాలంలో వ్యవసాయానికి రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇందులో రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామని అన్నారు. ఒకప్పుడువర్సిటీల్లో, కాలేజీల్లో విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్లు వేయాలని ధర్నాలు చేసేవారని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మాత్రం వరుస నోటిఫికేషన్లకు ప్రిపేర్‌ కావడం సాధ్యం కాదంటూ నోటిఫికేషన్లను వాయిదా వేయాలని ఆందోళనలు చేసున్నారని తెలిపారు. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్‌లో మరో లక్ష ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్స్‌ చార్జీలు 200 శాతం కాంగ్రెస్‌ ప్రభుత్వమే పెంచిందన్నారు.


చట్టాలుగా నినాదాలు: డిప్యూటీ సీఎం

తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవానికి భూమి నినాదాన్ని ఇందిర సౌర గిరి జలవికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. జల్‌, జంగల్‌, జమీన్‌, భూమికోసం, భుక్తికోసం, దోపిడీ విముక్తి కోసం పోరాటం వంటి నినాదాలు చట్టాలుగా మారాలంటే రాష్ట్రంలో 20 ఏళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉండాలన్నారు. జూన్‌ 2న గిరిజన యువతకు రాజీవ్‌ యువవికాసం స్వయం ఉపాధి పథకం ద్వారా రూ.1000 కోట్లు మంజూరు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎంపీలు మల్లు రవి, బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


కొండారెడ్డిపల్లి ఆత్మీయ ఆలింగనం చేసుకుంది: రేవంత్‌

బిడ్డకు తల్లి స్వాగతం పలికినట్టు.. కొండారెడ్డిపల్లి తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుందని సీఎం రేవంత్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘‘నా ఊరు, నా వాళ్ల మధ్యకు ఎప్పుడు వెళ్లినా అనిర్వచనీయ అనుభూతే. ఊరి పొలిమేరల్లో హనుమంతుడి ఆశీస్సులు ఆఽధ్యాత్మిక అనుభూతి’’ అని తెలిపారు. దీంతోపాటు, ‘‘ఇందిరమ్మ రాజ్యమంటే పేద గిరిజనుడికి భూమి ఇచ్చి.. సౌర విద్యుత్‌ ఇచ్చి.. ఆ భూమికి నీరు ఇచ్చి.. పంటకు పైసలిచ్చి.. పండిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవడం. నిన్న పోడు భూములిచ్చిన చేతులతో.. నేడు ఉచిత సోలార్‌ పంపు సెట్లు ఇచ్చే ఇందిర సౌర గిరి జలవికాసం పథకాన్ని నా సొంత గడ్డపై అచ్చంపేటలో ప్రారంభించాను’’ అంటూ సీఎం మరో పోస్టు చేశారు. తనతోపాటు తన గ్రామానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల బృందానికి ధన్యవాదాలు తెలిపారు.


కొండారెడ్డిపల్లిలో ఆంజనేయస్వామికి సీఎం ప్రత్యేక పూజలు

కల్వకుర్తి: మాచారంలో బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వచ్చారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి గీత, మనుమడు, కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్ర్తాలు సమర్పించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి , స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు ఉన్నారు.

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం..

కొందరు కడుపు నిండా విషం పెట్టుకొని.. ధనబలంతో సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. కానీ, వివిధ పథకాల లబ్ధిదారులకు తాను గుర్తుంటే చాలునని, ఆ సన్నాసులు తనకు లెక్కకాదని అన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో, శాంతిభద్రత పరిరక్షణలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, పన్ను వసూళ్లలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందంటూ కేంద్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎంతో మంది ప్రధానులయ్యారని, కానీ.. 50 ఏళ్ల తరువాత కూడా ప్రతీ పేదవాడి గుండెల్లో ఇందిర ఉన్నారని రేవంత్‌ అన్నారు. పహల్గాం దాడి అనంతర పరిణామాల్లో ప్రధానిగా ఇందిర ఉంటే నిటారుగా నిలబడి పాక్‌ను తుత్తునియలు చేసేవారని అందరూ అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇందిర సౌర గిరి జలవికాసం పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాచారం గ్రామానికి చెందిన చెంచు లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2025 | 05:53 AM