CM Revanth Reddy: ఫాంహౌస్‌కైనా వస్తా
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:15 AM
కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌ్‌సకు రమ్మంటే వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

అసెంబ్లీకి రాలేకపోతే అక్కడే చర్చిద్దాం.. తేదీ చెబితే వస్తాం.. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం
క్లబ్బుల్లో పబ్బుల్లో చర్చలంటే మాకు ఇబ్బంది
తెలంగాణ హక్కుల కోసం దేవుడి నైనా ఎదిరిస్తాం
తలా తోక లేకుండా మాట్లాడితే.. తోక కత్తిరిస్తాం
సీమాంధ్ర పాలకుల కంటే ఎక్కువగా.. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరే
రైతుల ప్రయోజనాలకు మరణశాసనం రాశారు
సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే ఎదురుదాడి
కేసీఆర్, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌ్‌సకు రమ్మంటే వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. అంతే తప్ప.. క్లబ్బులు, పబ్బులు అంటే తమకు ఇబ్బంది అని, వాటికి తాము దూరంగా ఉంటామన్నారు. తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టబోమని, ఎంతటి వారు వచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతామని పేర్కొన్నారు. దేవుడే ఎదురుగా వ చ్చినా ఎదిరిస్తామని చెప్పారు. అసూయ, అక్కసు, అహంకారంతో మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి తమ వద్ద కూడా మనుషులున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించుడం కూడా తమకు తెలుసునని హెచ్చరించారు. ‘కృష్ణా జలాల్లో గత పదేళ్లలో జరిగిన అన్యాయం, తుమ్మిడిహెట్టి బ్యారేజీ మార్పు, కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యం’పై మంగళవారం ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చింది. మీరేంది మాకు చెప్పేది? సహేతుకమైన విధానంతో ముందుకు రండి. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అసూయతో ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ల నీతి ఏంటో ప్రజలు గుర్తిస్తారు’’ అని రేవంత్ అన్నారు.
సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యి రెట్ల ద్రోహం
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం.. సీమాంధ్ర పాలకుల అన్యాయం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని ముఖ్యమంత్రి ఆరోపించారు. చేసిన తప్పులకు ఒకవేళ కొరడా దెబ్బలు కొట్టాల్సి వస్తే... కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాల్సి ఉంటుందన్నారు. అలాంటిది వారే ఎదురుదాడి చేస్తున్నారని, అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘కృష్ణా నదిలో హక్కుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటే బురద జల్లుతున్నారు. అంతర్జాతీయ జలవిధానం ప్రకారం బేసిన్ అవసరాలు తీరాకే ఇంకో బేసిన్‌కు నీటిని తరలించాల్సి ఉంటుంది. కానీ, కేసీఆర్ మాత్రం బేసిన్లు లేవు... బేషజాలు లేవు అన్నారు. ఆయనకు ఆ అధికారం ఎవరిచ్చారు? గోదావరి జలాలను కృష్ణా దాటించి.. పెన్నాకు తీసుకెళ్లండని ఏ హోదాలో చెబుతారు? వారి పక్షాన పాలెగాడి లెక్కన మారిండా? ఇది అడుగుదామంటే అసెంబ్లీకి రాడు. పిల్లలతో చిల్లర మాటలు మాట్లాడిస్తడు’’అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాలను తుమ్మిడిహెట్టి నుంచి తరలించడానికి వీలుగా 2007-08లో ప్రాణహిత-చేవెళ్లను చేపడితే.. తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ దానిని మార్చారని అన్నారు. చేవెళ్ల పేరుంటే చేవెళ్లకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని కాళేశ్వరం పేరు పెట్టారని ఆరోపించారు. ‘‘ప్రాణహిత-చేవెళ్ల ద్వారా చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌కు గోదావరి జలాలు ఇచ్చేందుకు రాయలసీమకు చెందిన నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి పనులు చేపడితే... తెలంగాణ జాతిపిత అని చెప్పుకొనేందుకు ప్రయత్నించే నువ్వు ఎందుకు తొలగించావు?’’ అని రేవంత్ ప్రశ్నించారు.
నాడు లాజిక్కులు.. ఇప్పుడు మాటలా?
తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో నీరు ఎల్లంపల్లికి వస్తుందని, పైన ఉన్న నీళ్లను పైనే వాడుకోవాలనేది కాంగ్రెస్ విధానమని సీఎం తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లికి తెచ్చిన తర్వాత ఎస్‌ఆర్‌ఎస్పీ, కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌లకు నీళ్లు నింపుకొని రంగారెడ్డికి తేవాలనేది ఆనాటి ప్రణాళిక అని పేర్కొన్నారు. ‘‘16 లక్షల ఎకరాలకు ప్రాణహిత-చేవెళ్ల కింద నీళ్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ విధానంగా ఉండేది. కానీ, నువ్వు రంగారెడ్డిని పూర్తిగా తొలగించినవ్. నల్లగొండకు కోతలు విధించినవ్. ఏందీ కారణం అంటే.. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే బేసిన్ల పంచాయతీ వస్తదని, నీటి కేటాయింపుల సమయంలో అన్యాయం జరుగుతుందని లాజిక్కు చెప్పినవ్. రాయలసీమకు నీళ్లు తరలించడానికి, వాళ్ల మెప్పు కోసం మమ్మల్నందరినీ తిడితివి. చేసిన తప్పులకు ప్రజలు శిక్షించినప్పుడు మౌనంగా ఉండకుండా మళ్లీ బజారుకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి వితండవాదం చేస్తావా?’’ అని సీఎం ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులతో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని, ఎకరానికి నీళ్లివ్వడానికి రూ.93 వేలు ఖర్చయ్యాయని తెలిపారు. కానీ, కేసీఆర్ 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. ఎకరానికి నీళ్లివ్వడానికి రూ.11.50 లక్షలకు పైగా ఖర్చు పెట్టారని అన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశావా? దీనిపై చర్చకు రావాలని అని సవాలు చేశాను. రాష్ట్రంలో 90 శాతం కేంద్ర గ్రాంట్లతో 11 ఏఐబీపీ ప్రాజెక్టులున్నాయి. కేంద్రం 90 శాతం నిధులు ఇచ్చినా ఖర్చు చేయలేదు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిస్తే చెప్పారు. మళ్లీ టార్గెట్‌గా పెట్టుకొని పూర్తి చేస్తామని ఆయనకు చెప్పినం. కేంద్రం ఇచ్చే నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులపై ఫోకస్ పెడితే సారుకు ఆదాయం ఏమీరాదనే వదిలేశారు’’ అని రేవంత్ ఆరోపించారు.
ఆ అధికారం కేసీఆర్‌కు లేదు..
ఉమ్మడి ఏపీ బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కృష్ణాలో కేటాయిస్తే.. 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు చాలునని కేసీఆర్ చెప్పారని రేవంత్ ఆరోపించారు. గోదావరిలో 3 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళుతున్నాయని, గ్రేటర్ రాయలసీమ దాకా నీళ్లు తీసుకెళ్లాలంటూ నాటి ఏపీ సీఎం జగన్‌కు సహకరించారని విమర్శించారు. వారిద్దరి మధ్య అనుబంధం పెంచుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ.. తెలంగాణ రైతాంగం పాలిట మరణశాసనం రాసే అధికారం మాత్రం కేసీఆర్‌కు లేదని అన్నారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి తీసుకోవాలని ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు తరలించాలని నిర్ణయం జరిగింది. జూరాల నుంచి పాలమూరు ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల నష్టం జరిగింది. తుంగభద్ర, కృష్ణానది, అలంపూర్‌కు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకొని ఉంటే.. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ఏపీ చేపట్టిన ముచ్చుమర్రి, మల్యాల, పోతిరెడ్డిపాడుకు మనం నీళ్లు వదిలితేనే వారికి నీళ్లు దొరికేవి. మీద(జూరాలలో) ఉన్నప్పుడు పట్టుకోకుండా కింద(శ్రీశైలంలో) పట్టుకోవడం వల్ల ఆ నీటిని ఏపీ దారిదోపిడీ చేయడానికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు. శ్రీశైలం నుంచి నీళ్లు తరలించుకుపోవడం వల్ల శ్రీశైలం, సాగర్, పులిచింతలలోని జలవిద్యుత్ ప్రాజెక్టులు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. చారాణా, ఆఠాణాకు దొరికే కరెంట్ పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ‘‘తొమ్మిదిన్నరేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదు. ఈ రోజు హక్కులు రాలేదు. ప్రయోజనాలు కూడా చేకూరలేదు. చివరికి సరిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని రేవంత్ ఆక్షేపించారు. ఈ సంవత్సరంలోనే రాష్ట్రం సర్వనాశనం అయిందంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏ రోజు అసెంబ్లీకి వస్తారో లేఖలు రాయాలని కోరాం. సూచనలు మాత్రమే చేశాం. సవాలు విసరలేదు. భవిష్యత్తు ప్రణాళికపై చర్చ చేద్దామనుకుంటుంటే సడెన్‌గా బయలుదేరాడు. ఆయన ఏం మాట్లాడుతుండో మీరందరూ చూస్తున్నరు. నేను ఆయన పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది. ఆ భాషకు ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. కాకపోతే ఆ దిశగా వెళ్లరాదని అనుకుంటున్నా’’ అని రేవంత్ అన్నారు.
గోదావరి బోర్డులో కూర్చొని మాట్లాడుకుందాం..
గోదావరి-బనకచర్లలో వరద జలాలనే తీసుకెళుతున్నామని చంద్రబాబు చెబుతున్నారని, అదే జలాలను రంగారెడ్డి, నల్లగొండకు తీసుకెళితే వారికి అభ్యంతరం ఎందుకని సీఎం రేవంత్ ప్రశ్నించారు. నికర జలాలపై ఎంత శాతం హక్కు ఉందో.. వరద జలాలపైనా అంతే హక్కు ఉంటుందన్నారు. ‘‘కాళేశ్వరం వైఫల్యం వల్ల నీళ్లు కిందికి వస్తున్నాయి.మేం వాడుకున్న తర్వాత కింద వరద ఉందా? లేక బురద ఉందా? అనేది తేలుతుంది. గోదావరి బోర్డులో కూర్చొని మాట్లాడుకుందాం. పరపతి ఉందని, పై(కేంద్రం) నుంచి వస్తామంటే ఎట్లా?’’అని ఏపీ సీఎం చంద్రబాబునుద్దేశించి అన్నారు. బనకచర్లపై పర్యావరణ మంత్రిత్వ శాఖ కు ఫిర్యాదుచేస్తే.. ప్రతిపాదనల్ని తిప్పి పంపించారని తెలిపారు. తమ బాధను తాము చెబుతున్నామని, తమ వ్యూహం తమకుంటుందని చెప్పారు.
తారీకు చెబితే సభ పెడతాం
పొద్దుటి పూట క్లబ్బుల్లో, రాత్రిపూట పబ్బుల్లో చర్చ చేద్దామని కొందరు ఉబలాట పడుతున్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ‘‘మీ సుదీర్ఘ అనుభవాన్ని, ఆలోచనల్నీ తెలంగాణ ప్రజలకు సూచన కింద ఇస్తే స్వాగతిస్తాం. మీరు ఏ తారీకు చెప్పినా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా, గోదావరి జలాలపె ఉమ్మడి రాష్ట్రంలో, తొమ్మిదిన్నరేళ్ల మీ పాలనలో, గడచిన ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకశంగా చర్చిద్దాం. స్పీకర్ అనుమతితో నిపుణులను కూడా పిలిచి అభిప్రాయం తీసుకుందాం’’ అని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని తాను అంటుంటే.. ఆయన కుమారుడు మాత్రం తన తండ్రి ఎందుకూ పనికిరారన్నట్లుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘మీ కుటుంబంలో పంచాయితీ ఉంటే మీ మధ్యే తేల్చుకోవాలే గానీ ఈ వీధి బాగోతాలెందుకు?’’ అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి