Share News

CM Revanth Reddy: పదేళ్లూ నేనే..!

ABN , Publish Date - Jul 19 , 2025 | 03:47 AM

పాలమూరు బిడ్డనైన తాను పదేండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి.

CM Revanth Reddy: పదేళ్లూ నేనే..!

పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి

  • మా మంచి పనులు చెబుతుంటే కుమిలి కుమిలి ఏడవాలి.. ఆయనను అసెంబ్లీకి పిలుస్తున్నది అందుకే

  • కేసీఆర్‌ బావిలో దూకినా, పెట్రోల్‌ పోసుకుని అంటించుకున్నా తెలంగాణలో అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదు

  • రాబోయే రెండున్నరేళ్లలో మరో 41 వేల కొలువుల భర్తీ

  • వర్గీకరణతో ఉపకులాల బిడ్డలకు మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ సీట్లు

  • పాలమూరు ప్రాజెక్టులకు డిసెంబరు 9లోపు నిధుల మంజూరు

  • కొల్లాపూర్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు

  • రాయలసీమ ఎత్తిపోతలను రద్దు చేయాలని బాబుకు వినతి

  • విజ్ఞప్తులు చేస్తామని, వినకుంటే పోరాటమేనని హెచ్చరిక

మహబూబ్‌నగర్‌/నాగర్‌కర్నూల్‌, జూలై18 (ఆంధ్రజ్యోతి): పాలమూరు బిడ్డనైన తాను పదేండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్షంలో కూర్చోవాలి. మేం చేసే మంచి పనుల గురించి చెబుతుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే ఆయన్ను అసెంబ్లీకి పిలుస్తున్నాం’’ అని చెప్పారు. కేసీఆర్‌ కడుపులో మంట పెట్టుకొని కళ్లల్లో నీళ్లు కారుస్తున్నాడని, కడుపులో విషం ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చి ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుందని విమర్శించారు. కడుపులో విషం ఉంటే కోసి తీసివేస్తారని అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని జటప్రోలులో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణానికి శుక్రవారం సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,52,635 మంది మహిళలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. అనంతరం జరిగిన ‘ప్రజా పాలన - ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్‌ శాపగ్రస్తుడని, బావిలో దుంకినా.. పెట్రోల్‌ పోసుకొని అంటించుకున్నా తెలంగాణ అభివృద్ధిని ఆపలేరన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం నిరుద్యోగ యువకులు ప్రాణ త్యాగాలు చేశారని, రెండు లక్షల కొలువులు ఖాళీ ఉంటే కేసీఆర్‌ తన ఇంటినిండా కొలువులు ఇచ్చుకున్నాడే తప్ప నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.


ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, వచ్చే రెండున్నర ఏళ్లలో 41 వేల కొలువులు భర్తీ చేసి లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ‘‘నల్లమల బిడ్డ సీఎం అయినందుకు దుఃఖం వస్తుందా!? 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న మాదిగ ఉప కులాలకు వర్గీకరణ చేసినందుకు దుఃఖం వస్తోందా!? వర్గీకరణతో ఆ ఉప కులాల బిడ్డలు చాలా మందికి మెడిసిన్‌లో, ఇంజనీరింగ్‌లో సీట్లు వచ్చాయి. వారి కళ్లలో సంతోషం చూశాను. గత ప్రభుత్వంలో ముదిరాజులు చేపలు పట్టుకోవాలి.. మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి.. గొల్ల కురుమలు గొర్లు కాయాలనే విధంగా పథకాలు అమలు చేశారు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ వర్గాల పిల్లలను చదివించాలని.. కలెక్టర్లను చేయాలని.. వారిని డాక్టర్లు, ఇంజనీర్లను చేయడం కోసం పని చేస్తుంది. ఇది మా ప్రభుత్వ విధానం’’ అని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీరు లేక పాలమూరు ఎడారిగా మారిందని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ కూడా ఉమ్మడి పాలకుల కంటే ఎక్కువ ద్రోహం చేశారని మండిపడ్డారు. రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, కానీ, లక్ష కోట్లు ఖర్చు చేసి కూలేశ్వరం కట్టారని విమర్శించారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు ఎన్ని వందల కోట్లు అవసరమైనా డిసెంబర్‌ 9లోపు మంజూరు చేసి.. రెండున్నరేళ్లలోపు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. తాము ఒకే విడతలో 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, కేసీఆర్‌ తన రెండు హయాముల్లో కలిపి16 వేల కోట్లను కూడా నాలుగు విడతల్లో చేశారని, అవి వడ్డీకి కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు.


సెల్ఫీలు.. సెల్ఫ్‌ డబ్బాలు..

సెల్ఫీలు దిగడం.. సెల్ఫ్‌ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఆడబిడ్డల కోసం కేటీఆర్‌ చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. తాము హైటెక్‌ సిటీ పక్కనే ఉన్న శిల్పారామం వద్ద మూడున్నర ఎకరాల స్థలం కేటాయించి 150 షాపుల్లో మహిళలు తాము తయారు చేసుకునే ఉత్పత్తులను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 2035 నాటికి ట్రిలియన్‌ ఎకానమీగా తెలంగాణను మార్చాలంటే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని, ఇందిరా మహిళా క్యాంటీన్లు, పెట్రోల్‌ బంకులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులు కొనివ్వడం, 1000 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతలు ఇవ్వడం, యూనిఫాంలు కుట్టించడం, రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అందులో భాగమేనని అన్నారు.


రెడ్డి బిడ్డ అయి ఉండి బీసీల తరఫున పని చేస్తున్నారు: మంత్రి వాకిటి

వెనకబాటులో ఉన్న వర్గాలకు ఆర్థిక, రాజకీయ, విద్య రంగాల్లో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీ కులగణన చేశారని, రెడ్డి బిడ్డ అయి ఉండి రేవంత్‌ రెడ్డి బీసీల తరఫున పనిచేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. వరి వేస్తే ఉరి అన్న నాటి నుంచి ఇప్పుడు గిట్టుబాటు ధరతోపాటు బోనస్‌ ఇస్తున్నామని, పండుగలప్పుడు తినే సోనామసూరి సన్న బియ్యాన్ని ప్రతిరోజు పేదలు తినేందుకు ఇస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 22 మంది ముఖ్యమంత్రులు కలిసి రూ.75 వేల కోట్ల అప్పు చేస్తే కేసీఆర్‌ ఒక్కరే పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని, పైగా తాము అభివృద్ధి చేస్తుంటే దాన్ని చూడలేక దుఃఖం వస్తోందని వరంగల్‌ సభలో వ్యాఖ్యానించారని కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఎన్నికల ముందు పాలమూరు- రంగారెడ్డిలో ఒక్క మోటార్‌ ఆన్‌ చేశారని, కాల్వలు నిర్మించకుండా ప్రచారం పొందేందుకు ప్రయత్నించారని విమర్శించారు. తొమ్మిదేళ్లలో వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని, వడ్డీ చెల్లింపులు చేయలేదని, తాము వడ్డీ లేని రుణాలు ఇస్తూ బీమా భద్రత కూడా కల్పిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. వర్గీకరణ చేశామని, 60 వేల ఉద్యోగాలు ఇచ్చి సాధికారత, సమన్యాయంతో పని చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఆర్థిక, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చింది కార్ల్‌ మార్క్స్‌ అయితే ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని సమర్థంగా అమలు చేస్తున్నది సీఎం రేవంత్‌ అని ఎంపీ మల్లు రవి అన్నారు.


రాయలసీమ లిఫ్టును రద్దు చేయండి

‘‘ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సీఎంగా ఉన్నప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. గతంలో పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు అదే పాలమూరు జిల్లాకు అన్యాయం చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి నినాదం ఇచ్చే మీరు ఉదారంగా వ్యవహరించండి. మీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు మీరే అడ్డుపడొద్దు. బాధ్యతగా ఉండి మమ్మల్ని బతకనివ్వండి’’ అని చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ లిఫ్టును రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని, వినకపోతే పోరాటాలు చేస్తామని, అందుకు తాను బాధ్యత తీసుకుంటానని, తమ రక్తంలోనే పోరాటం ఉందని స్పష్టం చేశారు.


కాంగ్రెస్‌లోకి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌

జడ్చర్ల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కోనేటి పుష్పలత కాంగ్రె్‌సలో చేరారు. ఆమెతోపాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు లలిత, ఉమాదేవి హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 06:49 AM