Hyderabad: డాక్టర్లలో తొలి భారతరత్న నాగేశ్వర్‌రెడ్డే కావాలి!
ABN , Publish Date - Mar 01 , 2025 | 03:47 AM
వైద్య రంగంలో ఇప్పటి వరకూ ఎవరికీ భారతరత్న రాలేదని, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఆ మహత్తర అవకాశం దక్కడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తుంది.. ఫ్యామిలీ డాక్టర్ విధానం కొనసాగాలి
ఆత్మీయంగా మాట్లాడితే రోగం నయం
తెలంగాణలో వైద్య విధానం తెస్తున్నాం
వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్
ఏఐజీ చైర్మన్ సన్మానంలో రేవంత్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంరఽధజ్యోతి): వైద్య రంగంలో ఇప్పటి వరకూ ఎవరికీ భారతరత్న రాలేదని, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఆ మహత్తర అవకాశం దక్కడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఇటీవల పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వైద్య పర్యాటక విధానాన్ని తీసుకురానుందని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు హైదరాబాద్ నుంచి అన్ని రకాల వైద్య సేవలు అందించేలా విధానాన్ని తెస్తామని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ, 10 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచే ఏటా 900 కోట్ల రూపాయలను పేదల వైద్యానికి ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వైద్యంతో పాటు అసలు రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తల మీద కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించిందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న కొద్దీ డాక్టర్ రోగితో సంభాషించే సమయం తగ్గిపోతోందని రేవంత్ ప్రస్తావించారు. తన దృష్టిలో ఇప్పటికీ వైద్యంలో ఫ్యామిలీ డాక్టర్ పాత్రే కీలకమని చెప్పారు. కుటుంబ సభ్యుడిలా మాట్లాడి వైద్యం అందిస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్నారు.
డాక్టర్ పలకరించే విధానంతోనే సగం రోగాలు నయమవుతాయని వ్యాఖ్యానించారు. అయితే, వైద్య వ్యవస్థలో రోజు రోజుకీ ఫ్యామిలీ డాక్టర్లు తగ్గిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ డాక్టర్‌కు మాత్రమే రోగి సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందని, చికిత్స సులభతరం అవుతుందని చెప్పారు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడల్లా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ హెల్త్ కార్డును తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో నాగేశ్వర్‌రెడ్డి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. గల్ఫ్ నుంచి హైదరాబాద్‌కు రోగులు ఎక్కువగా వస్తున్నారని, వారి కోసం మరిన్ని విమానయాన సేవలను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. 1000 ఎకరాలలో పూర్తి స్థాయి హెల్త్ క్యాంప్‌సను సృష్టిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వైద్యపరంగా ఎలాంటి సహాయమైనా చేయగలిగే స్థాయికి హైదరాబాద్ ఎదగాలని, అందుకు నాగేశ్వర్‌రెడ్డి లాంటి వారి సలహాలు కావాలని అన్నారు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఒక తెలుగు డాక్టర్‌కు మొట్టమొదటి సారిగా పద్మ విభూషణ్ రావడం, అదీ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి గుర్తింపు రావడం తనకు సంతోషం కలిగించిందని చెప్పారు. ఉత్తమ్ మాట్లాడుతూ, 30 సంవత్సరాలుగా తాను డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేషంట్‌నన్నారు. నాగేశ్వర్‌రెడ్డి గొప్ప మానవతావాది అని చెప్పారు. మంత్రులు దామోదర్ రాజనర్శింహ, డి.శ్రీధర్‌బాబు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఎన్నారై వైద్యులు డాక్టర్ విష్ణు, డాక్టర్ విజితారెడ్డిలు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.