Share News

Tribute To Ande Sri: అందెశ్రీ మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం

ABN , Publish Date - Nov 10 , 2025 | 10:42 AM

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహితీ లోకానికి అందెశ్రీ అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు.

Tribute To Ande Sri: అందెశ్రీ మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
Tribute To Ande Sri

అమరావతి, నవంబరు10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహితీ లోకానికి అందెశ్రీ అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు.

అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలి: సీఎం చంద్రబాబు

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande sri) ఆకస్మిక మృతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటని చెప్పుకొచ్చారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సీఎం చంద్రబాబు తెలిపారు.


అందెశ్రీ అక్షర యాత్ర చేశారు: పవన్ కల్యాణ్

ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందెశ్రీ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారని కొనియాడారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయిత అని వివరించారు. పలు సినీ గీతాలు రచించారని ప్రశంసించారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు...’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతోందని తెలిపారు. ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించారని కీర్తించారు. ఈ సందర్భంగా అందెశ్రీ కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


అందెశ్రీ సేవలు చిరస్మరణీయం: మంత్రి నారా లోకేష్‌

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాకవి అందెశ్రీ మృతిపై తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే పాటతోపాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి హృదయపూర్వక శ్రద్ధాంజలి అని చెప్పుకొచ్చారు. తెలుగు సాహితీ లోకానికి అందెశ్రీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా అందెశ్రీ కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్‌ తన సానుభూతి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డిసెంబర్ 6న డాలస్‌‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 10 , 2025 | 11:52 AM