Meeting: రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:46 AM
పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర జలవనరుల మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం
బనకచర్ల సహా ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చ
నేడు ఢిల్లీకి రేవంత్, చంద్రబాబు
తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాపై ఒత్తిడి తెద్దాం
అధికారులతో భేటీలో రేవంత్
హైదరాబాద్/న్యూఢిల్లీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సోమవారం ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. మంగళవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో భేటీకి ముందు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనధికారికంగా సమావేశమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగే భేటీలో ఇద్దరు సీఎంలు పాల్గొంటారు. ఈ సమావేశంలో చర్చించే అజెండాను తెలుగు రాష్ట్రాలే ఖరారు చేసుకొని, సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ అగర్వాల్ లేఖ రాశారు. తెలంగాణ సర్కారు సమావేశ అజెండాను పంపినట్లు తెలిసింది. అలాగే సీఎం రేవంత్ ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ సోమవారం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలే అజెండాగా ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కేంద్రంపై ఒత్తిడి తెద్దాం..
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని.. న్యాయంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడంతో పాటు ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన అధికారులతో భేటీ అయ్యారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రితో భేటీలో తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని, పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. నీటి వాటాను సాధించడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి వినియోగానికి కేసీఆర్ అంగీకరించారని ఆరోపించారు. గోదావరిపై ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.11 వేల కోట్ల ఖర్చుచేసిన తర్వాత దాన్ని పక్కనపెట్టి, కాళేశ్వరం నిర్మించి లక్ష కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ లేవనెత్తుతున్న అంశాలివే..!
గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీలతో రిజర్వాయర్‌ను కట్టాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఈ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచే కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదన కూడా ఇదే కావడం, తాజాగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కు సమ్మతి తెలుపుతూ మంత్రి ఉత్తమ్ లేఖ రాయడంతో ఈ అంశం కూడా చర్చకు రానుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ప్రభుత్వం 90 టీఎంసీలతో దాఖలు చేసింది. తొలిదశలో మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో ఈ డీపీఆర్‌కు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరనుంది. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి గరిష్ఠ వరద ఆధారంగా పరిహారం చెల్లించాలన్న ఐఐటీ ఖరగ్‌పూర్ నివే దికకు అనుగుణంగా.. చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, తక్షణమే ఛత్తీ్‌సగఢ్ నుంచి ఎన్‌వోసీ ఇప్పించాలని కేంద్రాన్ని కోరనుంది. కృష్ణా బేసిన్లో ఏపీ సర్కారు శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు అక్రమంగా నీటిని మళ్లిస్తోందని.. దాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. కృష్ణా జలాల పంపకంపై జరుగుతున్న జస్టిస్ బ్రిజే్‌షకుమార్ విచారణను సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ కేంద్రాన్ని కోరనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, డిండి, కొల్లాపూర్, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.
ఏపీ వాదన ఇలా
బనకచర్ల ట్రైబ్యునల్ పరిధిలోకి రాదని, తాము వరద జలాలతోనే ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని ఏపీ కేంద్రానికి చెప్పనుంది. గోదావరి జలాలు కృష్ణా నదికి వెళ్లకుండా నేరుగా పెన్నా బేసిన్‌కు తరలివెళ్లేలా చేస్తామని, అందువల్ల కృష్ణా-గోదావరి సంగమం కానీ, పొరుగు రాష్ట్రాలకు వాటా ఇవ్వడం కానీ జరగదని ఏపీ వాదిస్తోంది. వరద జలాలు సముద్రంలోకి వృథాగా పోకుండా ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి