Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:56 AM
రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరించి, ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు.

ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గ నిర్ణయం
పంచాయతీరాజ్ చట్టం-2018కు సవరణలు
మండలం, జిల్లా, రాష్ట్రం యూనిట్లుగా రిజర్వేషన్లు
ఆర్డినెన్స్ సంగతి ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
మరో 22,033 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ఎమిటీ, సెయింట్ మేరీలకు వర్సిటీల హోదా
3 అధునాతన గోశాలల ఏర్పాటుకు నిర్ణయం
నిర్వహణపై అధ్యయానికి సీఎ్‌సతో త్రిసభ్య కమిటీ
నాలుగు గంటలపాటు సాగిన క్యాబినెట్ భేటీ
సామాజిక విప్లవానికి నాంది.. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు చరిత్రాత్మకం: మహేశ్‌గౌడ్
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరించి, ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి, తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రివర్గం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3.30 నుంచి నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్యాబినెట్ సమావేశ వివరాలను విలేఖర్లకు వివరించారు. మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఆమోదించారు. అయితే, వాటికి రాష్ట్రపతి ఆమోదం పొందడం ఆలస్యం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను నెల రోజుల్లో ఖరారు చేయాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గురువారం సమావేశమైన మంత్రివర్గం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది.
రాష్ట్ర ప్రణాళిక విభాగం అధ్వర్యంలో కుల గణనను చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది. సర్పంచి, ఎంపీటీసీ పదవులకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా యూనిట్‌గా తీసుకోవాలని, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని నిర్ణయించారు. 42 శాతం రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా తెస్తారని ఇదివరకే ‘ఆంధ్రజ్యోతి’ కథనాలను ప్రచురించింది. విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని, గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ మంత్రి, ఇతర మంత్రులు అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించారని తెలిపారు. అధికారులు కొర్రీలు వేస్తూ సాగదీస్తూ ఉండటంతో అడ్వొకేట్ జనరల్‌ను రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి పిలిపించి చర్చించామన్నారు. న్యాయపరంగా భవిష్యత్తులో చిక్కులు రాకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆర్డినెన్స్ మార్గంలో రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. ఇందుకు గాను పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ను తెస్తామన్నారు.
ప్రతీ నిర్ణయాన్ని సమీక్షించాం
క్యాబినెట్ సమావేశం కొత్త సంప్రదాయానికి తెర లేపింది. ఇదివరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న 327 నిర్ణయాలను సాంతంగా సమీక్షించిందని మంత్రి పొంగులేటి వివరించారు. 23 ప్రధాన శాఖలకు సంబంధించిన నిర్ణయాలన్నీ సమీక్షించి, 321 అంశాలు అమల్లోకి రావడాన్ని క్యాబినెట్ ఆమోదించిందన్నారు. నిర్ణయాలు ఎంతవరకు అమలయ్యాయో అంశాల వారీగా చర్చించామన్నారు. 96 శాతం నిర్ణయాలకు సంబంధించి ఆదేశాలు ఇచ్చి అమల్లో పెట్టినట్లు గుర్తించామని చెప్పారు. మిగతా వాటి గురించి సంబంధిత శాఖల అధికారులు స్పష్టతనిచ్చారన్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని గతంలో అనుకున్నామని గుర్తు చేస్తూ ఈ నెల 25వ తేదీన మరోసారి మంత్రివర్గ సమావేశం జరుపుతామని ప్రకటించారు. మూడు నెలలకోసారి గత ఆరు క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించాలని తాజా భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశానికే తెలంగాణ క్యాబినెట్ సమావేశాలు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
రెండు ప్రైవేటు యూనివర్సిటీలు
ఎమిటీ విద్యా సంస్థ, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ సంస్థలకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల హోదా ఇవ్వనున్నట్లు పొంగులేటి చెప్పారు. తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్లలో 50 శాతం కోటా ఇవ్వాలని ఎమిటీకి నిబంధన విధించామని తెలిపారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని ప్రాజెక్టులపై చర్చించామన్నారు. గత పభుత్వం వ్యక్తిగత స్వార్థంతో ఈ ప్రాజెక్టులను పూర్తిగా వదిలేసిందని తెలిపారు. 2, 3, 4 శాతం మేర పనులు పెండింగ్‌లో ఉన్నా పూర్తి చేయకుండా, ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేని విధంగా మార్చారని ఆరోపించారు. వాటి భూసేకరణ పూర్తి చేసి, అసంపూర్తి పనులను పూర్తి చేసి, నీళ్లివ్వాలని నిర్ణయించామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను పంచాయతీల జాబితా నుంచి తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.
కొత్తగా 22 వేల ఉద్యోగాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఏడాదిన్నర వ్యవధిలో తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. వచ్చే మార్చి లోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలన్నది తమ లక్ష్యమని ప్రకటించారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పని తీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తేవాలని సీఎం ఆదేశించారన్నారు. అధికారుల కమిటీకి ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. వారు రెండు నెలల్లో పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సభలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి సహకరించిన విధంగానే రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటి అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గోశాలల నిర్వహణపై అధికారుల కమిటీ: వాకిటి శ్రీహరి
రాష్ట్రంలోని గోశాలల నిర్వహణ, మూడు అధునాతన గోశాలల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో త్రిసభ్య కమిటీని వేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ తెలిపారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోశాలలపై పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ సమీపంలోని ఎన్కేపల్లి వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్ట గోశాలలను అత్యాధునిక గోశాలలుగా నిర్మించాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించామని తెలిపారు. వాటి నమూనాలను మంత్రివర్గ సమావేశంలో ప్రదర్శించినట్లు చెప్పారు. గోశాలలను రిజిస్టర్ చేయాలని, వాటి నిర్వహణపై సమగ్ర పాలసీని రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. క్రీడా పాలసీని తెస్తున్నట్లు మంత్రి చెప్పారు. మత్స్య సహకార సంఘాలకు పర్సన్ ఇన్‌చార్జీలను నియమిస్తామని తెలిపారు. చెరువులు, కుంటల్లో 82 కోట్ల చేపలను వదలాలని, 80 నుంచి 110 ఎంఎం సైజు చేపలను అందజేయాలని నిర్ణయించామన్నారు. మత్స్య శాఖకు రూ.122 కోట్లను కేటాయించడానికి క్యాబినెట్ ఆమోదించిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News