Share News

N Ramchander Rao: రాష్ట్రంలో అధికారమే లక్ష్యం!

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:11 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే తమ తొలి లక్ష్యమని బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు చెప్పారు.

N Ramchander Rao: రాష్ట్రంలో అధికారమే లక్ష్యం!

స్థానిక సంస్థల ఎన్నికలే తొలి టార్గెట్‌.. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే

  • బీఆర్‌ఎ్‌సను జనం మరిచిపోయారు

  • బీజేపీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు

  • మా పార్టీలో ఎలాంటి విభేదాలూ లేవు

  • అందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం

  • ‘ఆంధ్రజ్యోతి’తో ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే తమ తొలి లక్ష్యమని బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే అంతిమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసేనని తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్‌ తమకు ఏ దశలోనూ పోటీ కాదన్నారు. పార్టీలో సీనియర్‌ నాయకుల సలహాలు, సూచనలతో కలిసికట్టుగా ముందుకు వెళతామని తెలిపారు. పార్టీ కేంద్ర నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కారణమేనని చెప్పారు. అవినీతిలో బీఆర్‌ఎ్‌సకు పోటీగా కాంగ్రెస్‌ పాలన సాగుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రాంచందర్‌రావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు?

మా తొలి ప్రాధాన్యం స్థానిక సంస్థల ఎన్నికలే. ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా మెజారిటీ స్థానాలు గెలిచి, సత్తా చాటుతాం. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఎన్నికలకు ఆ పార్టీ భయపడుతోంది. ఏదో ఒక సాకుతో వాయిదా వేసే ప్రయత్నం చేస్తోంది. గతంలో పోలిస్తే మేం చాలా బలపడ్డాం. ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలతో పాటు ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఇక తదుపరి లక్ష్యం వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే.


మీ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు?

మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే. బీఆర్‌ఎస్‌ పార్టీ క్రమంగా కనుమరుగవుతోంది. ఆ పార్టీని జనం కూడా మరిచిపోయారు. బీఆర్‌ఎస్‌ ఏ దశలోనూ మాకు పోటీ కాదు. ఇక గ్రూపులతో కాంగ్రెస్‌ పార్టీ సతమతమవుతుంటే ఎందుకు ఎన్నుకున్నామా? అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్‌.. రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఏడాదిన్నర గడిచినా అతీగతీ లేదు. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వానికి తెలంగాణ ఏటీఎంలా మారింది. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయగా.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపుతోంది. అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇంతకుముందు రాష్ట్రంలో బీజేపీకి 11లక్షల మంది సభ్యులు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 36 లక్షలు దాటింది. అన్ని వర్గాల ప్రజలూ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారు.

క్యాడర్‌లో నిరాశ, నిస్పృహలను ఎలా అధిగమిస్తారు?

కార్యకర్తలను మరింత క్రియాశీలం చేసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడతాం. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి చర్చిస్తా. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాం.

పార్టీలో ముఖ్యులు, సీనియర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది?

అదంతా తప్పుడు ప్రచారం. పార్టీలో ఆధిపత్య పోరు లేదు. గ్రూపులూ లేవు. అంతా కలిసికట్టుగా ఉన్నాం. మాకు సమర్థ నాయకులు ఉన్నారు. వారి సేవలను వినియోగించుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ఇక పాత, కొత్త అన్న వివక్ష మా పార్టీలో లేనేలేదు.


ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవ్‌

అమరావతి, విశాఖపట్నం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. అనేక మంది పెద్దలు పోటీ పడినా మాధవ్‌నే అదృష్టం వరించింది. సుదీర్ఘకాలంగా ఆయన చేసిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్ఠానం.. కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో సోమవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి శివ ప్రకాశ్‌, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో ఇతరులెవ్వరూ నామినేషన్‌ వేయకపోవడంతో మాధవ్‌ పేరు అధ్యక్షుడిగా ఖరారైంది. విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో మంగళవారం జరిగే రాష్ట్ర బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారు.


విశాఖపట్నానికి చెందిన పాతతరం బీజేపీ నాయకుడు పీవీ చలపతి రావు కుమారుడు మాధవ్‌. చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. అదే వారసత్వాన్ని తన పనితీరు ద్వారా మాధవ్‌ అందిపుచ్చుకున్నారు. చలపతిరావు దంపతులకు అనకాపల్లిలో 1973 ఆగస్టు 10న మాధవ్‌ జన్మించారు. మాధవ్‌ విద్యార్థి దశలో ఏబీవీపీలో చేరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం)లో 2003లో చేరి క్రియాశీల రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 2003 నుంచి 2007 వరకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2007 నుంచి 2010 వరకు మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశారు. 2010-2013 వరకూ బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.2009లో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా 2017లో పోటీ చేసి విజయం సాధించారు. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా సేవలు అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 01 , 2025 | 08:24 AM