Amit Shah Orders: పాకిస్థానీలను వెనక్కి పంపండి
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:12 AM
దేశ భద్రత నేపథ్యంలో పాకిస్థానీయులను వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్‌లోని 208 మంది పాకిస్థానీయులు ఈ నెలాఖరు వరకు దేశం విడిచి వెళ్లాలని డీజీపీ స్పష్టం చేశార

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్
దేశ భద్రత రీత్యా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యల్ని వివరించిన కేంద్ర హోంమంత్రి
ఒక్క పాకిస్థానీ కూడా ఉండొద్దు.. అన్ని రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేసిన షా
హైదరాబాద్‌లో 208 మంది పాకిస్థానీలు.. రాష్ట్రం నుంచి తక్షణం వెళ్లిపోవాలి: డీజీపీ
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. దేశ భద్రత, కేంద్ర, రాష్ట్రాల మధ్య పాలనా పరమైన సంబంధాల్లో భాగంగా ఆయన రేవంత్‌తో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలో ఉన్న పాకిస్థానీలను ఈ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కోరారు. పాకిస్థానీలకు ఇచ్చిన వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో నిర్దేశిత గడువు తర్వాత ఒక్క పాకిస్థానీ కూడా దేశంలో ఉండవద్దని షా స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులను కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఎంత మంది పాకిస్థానీలు ఉన్నారో లెక్క తీయాలని, వారందరినీ తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఫోన్ చేసి తెలంగాణలోని పాకిస్థానీలను పంపించేయాలని షా చెప్పారు. వాస్తవానికి హైదరాబాద్‌లోని అనేక ముస్లిం కుటుంబాలకు పాకిస్థాన్ దేశస్థులతో పెళ్లి సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. అలాగే అనేక మంది పాకిస్థానీలు వైద్యం కోసం హైదరాబాద్ వస్తుంటారు. వీరిలో సరైన పత్రాలు, వీసాలతో వచ్చేవారితో పాటు అక్రమంగా వచ్చి వెళ్లే వారూ ఉంటారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్లు రేవంత్‌కు అమిత్‌షా తెలిపారు. పాక్ పౌరులను పంపించివేయాలని చెప్పారు. సాధారణ వీసాపై వచ్చిన పాక్ వాసులు ఈ నెల 27 కల్లా, మెడికల్ వీసాపై వచ్చిన వారు 29 కల్లా దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. షాతో మాట్లాడిన అనంతరం పాక్ పౌరులను పంపించే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీని ఆదేశించారు.
హైదరాబాద్‌లో 208 మంది పాకిస్థానీలు..
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ జితేందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ వీసాలపై వచ్చిన పాకిస్థానీలు ఈ నెల 27 కల్లా, వైద్య వీసాలపై వచ్చినవారు 29 కల్లా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ నెల 30 తర్వాత అట్టారీ సరిహద్దును మూసివేస్తున్నట్లు తెలిపారు. నిర్దేశిత గడువులోగా పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లకుంటే చట్టరీత్యా చర్యలుంటాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 208 మంది పాకిస్థానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 8 మంది మెడికల్ వీసాలపై, 156 మంది లాంగ్‌టర్మ్ వీసాలపై, నలుగురు షార్ట్ టర్మ్ వీసాలతో వచ్చారని, మిగిలిన వారు ఇతర పనులపై వచ్చారని తేల్చారు.
జైల్లో ఒకరు.. పోలీసుల అదుపులో మరొకరు
రాష్ట్ర జైల్లో ఏళ్ల తరబడి ఉంటున్న పాక్ ఖైదీని ఏం చేయాలనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడంటూ పాక్‌కు చెందిన నజీర్(55)ను రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో తాను హైదరాబాదీనని చెప్పడంతో అతన్ని తెలంగాణ పోలీసులకు అప్పగించారు. అయితే అక్రమంగా చొరబడినట్లు తేలడంతో నజీర్‌కు కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. 2018లోనే శిక్ష పూర్తయినా నజీర్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. అతని విషయాన్ని అధికారులు పాకిస్థాన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లగా.. తమ దేశస్థుడు కాదని చెప్పడం గమనార్హం. ఇప్పుడు నజీర్ విషయంలో ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉస్మాన్ అనే పాకిస్థానీ ఉన్నట్లు సమాచారం.