Share News

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:39 AM

సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో.. లఢక్‌లోని లేహ్‌లో.. కేవలం 14 గంటల్లో సైన్యం కోసం బంకర్‌ను నిర్మించారు. ఐఐటీ హైదరాబాద్‌, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ అనే సంస్థ కలిసి 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని సాకారం చేశాయి.

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

  • స్వదేశీ సాంకేతికతతో హిమాలయాల్లో నిర్మించిన ఐఐటీహెచ్‌, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌

  • 11 వేల అడుగుల ఎత్తులో నిర్మాణం

కంది, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో.. లఢక్‌లోని లేహ్‌లో.. కేవలం 14 గంటల్లో సైన్యం కోసం బంకర్‌ను నిర్మించారు. ఐఐటీ హైదరాబాద్‌, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ అనే సంస్థ కలిసి 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని సాకారం చేశాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన 3డీ నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది. భారత సైన్యం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ ప్రభల్‌లో భాగంగా.. సైనికుల వినియోగం కోసం దీనిని నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్‌ కేవీఎల్‌ సుబ్రమణ్యం మార్గదర్శకత్వంలో ఐఐటీహెచ్‌ బృందాలు, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ సంస్థ ప్రతినిధులు.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా పని చేసే ప్రత్యేక 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఐఐటీహెచ్‌ పీహెచ్‌డీ విద్యార్థి అరుణ్‌ కృష్ణన్‌ దీనికి సహకారం అందించారు.


స్థానికంగా లభించే వనరులతోనే ఈ సాంకేతికత పని చేయటం విశేషం. ఈ టెక్నాలజీతోనే హిమాలయాల్లోని లేహ్‌లో సైనిక బంకర్‌ను నిర్మించారు. శనివారం దీనికి సంబంధించిన వివరాలను ప్రొఫెసర్‌ కేవీఎల్‌ సుబ్రహ్మణ్యం, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ సీఈవో ధ్రువ్‌ గాంధీ వెల్లడించారు. లఢఖ్‌ వంటి ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్‌ తక్కువగా ఉంటుందని, అలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఒక సవాల్‌గా తీసుకొని ప్రాజెక్ట్‌ను విజయవంతం చేశామని ధ్రువ్‌గాంధీ తెలిపారు. రోబోటిక్‌ ప్రింటర్‌ వ్యవస్థను 24 గంటల్లో సిద్ధం చేసి, ఐదు రోజుల రికార్డు సమయంలో పూర్తి చేశామని.. ప్రింటింగ్‌కు 14 గంటలు పట్టిందని వెల్లడించారు. ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్‌, తక్కువ ఆర్ధ్రతతోపాటు ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని.. అలాంటి పరిస్థితులను తట్టుకోవటానికి వీలుగా యంత్రాలను రూపొందించామని ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రత్యేకమైన కాంక్రీట్‌ మిశ్రమాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 04:39 AM