Share News

Umran Malik: కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:43 PM

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నానని, త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తానన్న నమ్మకం ఉందని స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. 150 కిమీ వేగంతో ఎవ్వరూ బౌలింగ్ చేయలేరని.. దానికి ఎంతో ధైర్యం కావాలని అన్నాడు.

Umran Malik: కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
Umran Malik

ఇంటర్నెట్ డెస్క్: ఉమ్రాన్ మాలిక్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. అతడి పేరు వినగానే 150కిమీ వేగంతో దూసుకొచ్చే బంతులే గుర్తొస్తాయి. బౌలింగ్‌లో మంచి పేస్ ఉన్న ఉమ్రాన్.. భారత జట్టులో స్థానాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అతడు టీమిండియాకు ఆడి ఎన్నో రోజులవుతోంది. ప్రస్తుతం ఉమ్రాన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా తుది జట్టులోకి రావడంపై ఉమ్రాన్(Umran Malik) స్పందించాడు.


‘నేను ప్రస్తుతం మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నా. కచ్చితంగా త్వరలోనే టీమిండియాలో(Team India)కి తిరిగి వస్తా అనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నేను మాత్రమే 150కిలో మీటర్ల వేగంతో బంతులు సంధించగలను. స్లో బాల్స్ మీద కూడా కసరత్తులు చేస్తున్నా. అలాగే యార్కర్లపై కూడా దృష్టి పెడుతున్నా. రెడ్ బాల్ క్రికెట్‌లో వీటిని ఆచరణలో పెడుతున్నా’ అని సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం ఉమ్రాన్ మాలిక్‌ అన్నాడు.


అది వారిష్టం..

‘సెలక్టర్లు నన్ను ఎప్పుడు జాతీయ జట్టులోకి తీసుకుంటారనేది వారిష్టం. నేను మాత్రం ఇప్పుడు బాగా రాణిస్తున్నా. మరో విషయం ఏంటంటే అందరూ 150 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేయలేరు. ఆ వేగంతో బౌలింగ్‌ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. నేను గత ఐదేళ్లుగా ఇదే వేగంతో బంతులు సంధిస్తున్నా’ అని ఉమ్రాన్‌ మాలిక్‌ పేర్కొన్నాడు.


ఉమ్రాన్‌ మాలిక్‌ ఇప్పటివరకు 10 వన్డేలు, 8 టీ20ల్లో టీమిండియా తరఫున 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2023లో వెస్టిండీస్‌ టూర్‌ తర్వాత నుంచి అతడు జాతీయ జట్టుకు ఎంపిక కావడం లేదు. ఐపీఎల్‌లో (IPL) అతడు ఇప్పటివరకు 29 వికెట్లు తీసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్ ఆడకు.. బుమ్రాకు అశ్విన్ సూచన

‘దిష్టి’ ఎమోజీతో రూమర్స్‌కు చెక్ పెట్టిన స్మృతి-పలాశ్

Updated Date - Nov 29 , 2025 | 04:43 PM