Share News

Kapil Dev: ప్రస్తుతం అలాంటి బ్యాటర్లే లేరు.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:42 PM

సౌతాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ విషయంపై స్పందించారు.

Kapil Dev: ప్రస్తుతం అలాంటి బ్యాటర్లే లేరు.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
Kapil Dev

ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాలో చేతిలో టీమిండియా 0-2 తేడాతో వైట్ వాష్ అయి టెస్ట్ సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రధాన కోచ్ పదవిలో గంభీర్‌ని తీసేయాలని.. అతడి నిర్ణయాల వల్లే జట్టు ఓటమిపాలవుతుందని విమర్శించారు. అలాగే స్పిన్ ఆడే విషయంలో భారత బ్యాటర్ల సమర్థతపై క్రికెట్ విశ్లేషకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెస్టు క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి అశ్విన్ తప్పుకున్న తర్వాత భారత జట్టు ఇప్పుడు సంధి దశలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా సరైన మార్గంలో పయనిస్తోందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


‘ప్రస్తుతం మనం ఎక్కువగా టీ20లు, వన్డే మ్యాచ్‌లు ఆడుతున్నాం. దీంతో బ్యాటర్లు.. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. స్పిన్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు చాలా ఓపిక ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రస్తుతం మన దగ్గర రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి బ్యాటర్లే లేరు. టెస్టుల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమే. ఇప్పుడున్న బ్యాటర్లకు అంత ఓపిక ఉండట్లేదు’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.


పంత్ విషయం వేరు..

‘స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎంతో నైపణ్యం ఉండాలి. కానీ టర్న్, బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ చేయాలంటే చాలా కష్టం. అలాగే ఈ విషయంలో ఫుట్ వర్క్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. రిషభ్ పంత్(Rishabh Pant) విషయం మాత్రం వేరు. ఎందుకంటే అతడు సహజ సిద్ధమైన మ్యాచ్ విన్నర్. అతడిని డిఫెన్స్ఆడమని మనం కోరలేం. ఎందుకంటే పంత్ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడి.. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పెట్టగల సమర్థుడు. అలాంటి నైపుణ్యమున్న పంత్‌ని.. మనం నెమ్మదిగా ఆడి 100 బంతుల్లో 20 పరుగులు చేయమని చెప్పలేం’ అని కపిల్ దేవ్ వివరించారు.


ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్ ఆడకు.. బుమ్రాకు అశ్విన్ సూచన

‘దిష్టి’ ఎమోజీతో రూమర్స్‌కు చెక్ పెట్టిన స్మృతి-పలాశ్

Updated Date - Nov 29 , 2025 | 03:42 PM