IPL 2026: కావ్య ఏం చేయబోతోంది?
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:02 PM
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో 15 మందిని మాత్రమే రిటైన్ చేసుకుంది. దీంతో పది ఖాళీలు ఏర్పడ్డాయి. పర్సులో కేవలం రూ.25కోట్లే ఉన్నాయి. దీంతో వేలంలో కావ్య మారన్ ఏం చేయనుందోనని ఆసక్తిగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో అందరి దృష్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ వైపే ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో 15 మంది ఆటగాళ్లనే రిటైన్ చేసుకోవడంతో ఏకంగా పది స్లాట్లలో ఖాళీలున్నాయ్. ఈ అనూహ్య నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
పర్సులో ఎంత?
ఎస్ఆర్‌హెచ్(SRH) ఎక్కువ మంది ఆటగాళ్లను రిలీజ్ చేయడం యాజమాన్యం తెలివైన వ్యూహంగా కొందరు భావిస్తున్నారు. ఈసారి పాత తప్పులను రిపీట్ చేయకుండా జట్టుకు సరిగ్గా సరిపోయే సరికొత్త స్టార్లను ఎంచుకునే అవకాశం దొరికిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. హైదరాబాద్ జట్టు పర్సులో ఉంది కేవలం రూ.25.5కోట్లే. పది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఆటగాడికి రూ.2.5కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయలేరు. ఒక్క స్టార్ ప్లేయర్ కోసం రూ.8-10కోట్లు ఖర్చు చేస్తే.. మిగిలిన 9 మందిని కనీస ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ అంశంపై ఆరెంజ్ ఆర్మీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కెప్టెన్సీపై అనిశ్చితి
రిటెన్షన్ జాబితాలో కెప్టెన్సీ అభ్యర్థి గురించి ఎలాంటి స్పష్టత లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. వేలంలో అనుభవజ్ఞుడైన ఆటగాడిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయాలి. లేదా జట్టులోనే సీనియర్ ఆటగాడికి బాధ్యతలు అప్పగించాలి. కెప్టెన్సీని పరిష్కరించకుండా జట్టు సమతుల్యత సాధించడం కష్టమని అభిమానుల అభిప్రాయం.
వేలం అంచనాలు..
జట్టు వద్ద కేవలం రెండు విదేశీ స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రిటెన్షన్ లిస్ట్ బట్టి చూస్తే, ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మరింత లోతు అవసరం కావచ్చు. కాబట్టి ఒక మంచి దేశీయ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేదా విదేశీ ఫాస్ట్ బౌలర్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బంది ఈ 10 ఖాళీ స్లాట్లను ఎలా ఉపయోగించుకుంటారనే దానిపైనే 2026 సీజన్‌లో జట్టు ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. వేలం రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి. మరి ఫ్రాంచైజీ సీఈవో కావ్య మారన్ ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
సంజూ మానసికంగా అలసిపోయాడు: ఆర్ఆర్ ఓనర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి