Ind Vs SA: గిల్ డిశ్చార్జ్.. నెక్ట్స్ ఏంటి?
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:49 AM
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సౌతాఫ్రికాతో టెస్ట్‌లో గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి.. ఆసుపత్రిలో చేరాడు. తాజాగా గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పితో ఆసుపత్రిలో చేరిన గిల్ తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. అతడు ప్రస్తుతం టీమ్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెడ గాయం నుంచి కోలుకుంటున్నందున గిల్‌కు విమాన ప్రయాణాలు చేయొద్దని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. కనీసం వారం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. టీమ్ హోటల్‌లో ఉన్న గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.
రెండో టెస్టుకు ఆడతాడా?
ప్రస్తుతం కోలుకుంటున్న గిల్(Shubman Gill).. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా? అనేది ప్రశ్న. ప్రస్తుతం అతడు మెడను అటు ఇటు సులువుగా కదపగలుగుతున్నాడు. వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. నవంబర్ 22 నుంచి గువాహటి వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులోకి రావడం కష్టమే అని సమాచారం. తొలి టెస్టులోనే గిల్ ఆడకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి.
ఎలా గాయపడ్డాడంటే..
సౌతాఫ్రికాతో రెండో రోజు ఆట సందర్భంగా సైమన్ హర్మర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించాడు. ఇంతలోనే మెడ పట్టేసింది. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో మూడు బంతులు ఆడిన తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గాయం తీవ్రతరం కావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. కాగా తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి