Bumrah: బావుమాకు సారీ చెప్పిన బుమ్రా!
ABN , Publish Date - Nov 17 , 2025 | 07:50 AM
సాతాఫ్రికా కెప్టెన్ బావుమాను బుమ్రా మరుగుజ్జు అంటూ సంబోధించిన విషయం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత బావుమాకు బుమ్రా సారీ చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా(Team India)తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా బ్యాటర్లు ఛేదించలేకపోయారు. అయితే తొలి రోజు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, భారత స్టార్ పేసర్ బుమ్రా మధ్య నెలకొన్న మరుగుజ్జు వివాదం సద్దుమణిగింది. తొలి టెస్ట్ ముగిసిన తర్వాత బావుమాకు బుమ్రా క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఆ పదం వాడలేదని బవుమా దగ్గరకు వెళ్లి అప్యాయంగా మాట్లాడాడు. దీంతో ప్రొటీస్ కెప్టెన్ కూడా బుమ్రాను ఆలింగనం చేసుకుంటూ నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏమైందంటే?
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 13 ఓవర్లో ఆఖరి బంతిని బవూమాకు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అది ఆడే క్రమంలో బంతి బవూమా(Temba Bavuma) ప్యాడ్‌కు తగిలింది. దీంతో బౌలర్‌తో ఫీల్డర్లు కూడా ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నో అంటూ తలూపాడు. దీంతో డీఆర్ఎస్ తీసుకునే విషయంలో బుమ్రా, వికెట్ కీపర్ పంత్ చర్చించుకున్నారు. బంతి ప్యాడ్స్‌కు ఎత్తుగా తగిలిందని పంత్ చెప్పినప్పుడు అందుకు బుమ్రా(Jasprit Bumrah) ‘బౌనా భీ హై’ అని సమాధానమిచ్చాడు. ‘బౌనా’ అంటే మరుగుజ్జు అని అర్థం. బవూమా పొట్టిగా ఉండటం వల్ల బంతి స్టంప్స్‌ను మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి బుమ్రా ఆ పదం ఉపయోగించాడు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు.
ఈ విషయంపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్‌వెల్ ప్రిన్స్ కూడా స్పందించాడు. ‘ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ ఇప్పటివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి చర్చ రాలేదు. ఇక్కడ జరిగిన దానివల్ల ఎవ్వరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదని అనుకుంటున్నా’ అని ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. బుమ్రా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది.
ఇవి కూడా చదవండి:
తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి