Ganguly: ‘రిచా భారత కెప్టెన్’: సౌరవ్ గంగూలీ
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:21 PM
వన్డే ప్రపంచ కప్ విజయంలో రిచా ఘోష్ కీలక పాత్ర పోషించింది. ఆమెపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురింపించాడు. భవిష్యత్తులో రిచాను కెప్టెన్‌గా చూడాలని ఉందని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ విజయంలో రిచా ఘోష్(Richa Ghosh) కీలక పాత్ర పోషించింది. బ్యాటర్, వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణించింది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) రిచాపై ప్రశంసల వర్షం కురిపించాడు. శనివారం ఆమెను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం(Bengal government) ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి హాజరైన గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నీ కెరీర్ ఇప్పుడే మొదలైంది. రాబోయే నాలుగు నుంచి ఆరేళ్లలో మహిళల క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరిన్ని అవకాశాలు వస్తాయి. నువ్వు వాటిని సద్వినియోగం చేసుకుంటావని నేను ఆశిస్తున్నా. ఏదో ఒక రోజు జులన్ గోస్వామి లాగా మనం ఇక్కడ నిలబడి ‘రిచా భారత కెప్టెన్’ అని చెబుతాం. రిచా.. నీకు ఇంకా 22 ఏళ్లే. ఎంతో భవిష్యత్తు ఉంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు. లోయర్ ఆర్డర్‌లో ఆడటం చాలా కష్టం. కానీ రిచా తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసింది. సెమీ ఫైనల్‌లో జెమీమా రోడ్రిగ్స్ 127*, హర్మన్ ప్రీత్ 89 పరుగుల ఇన్నింగ్స్‌నే అందరూ గుర్తు పెట్టుకుంటారు. కానీ 130 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో రిచా చేసిన రన్స్ చాలా విలువైనవి’ అని గంగూలీ పేర్కొన్నాడు.
రిచాకు సన్మానం..
శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) రిచాను సన్మానించింది. ప్రపంచ కప్ గెలిచిన పశ్చిమ బెంగాల్ తొలి మహిళా క్రికెటర్‌గా రిచా ఘోష్(Richa Ghosh) రికార్డు సృష్టించింది. దీంతో మమత ప్రభుత్వం రిచాకు ‘బంగభూషణ్’ పురస్కారంతో పాటు డీఎస్పీ(DSP) పదవి నియామక పత్రంతో సత్కరించింది.ప్రపంచ కప్ ఫైనల్‌లో రిచా చేసిన ప్రతి పరుగుకు రూ.లక్ష చొప్పున.. మొత్తం రూ.34లక్షల నగదును అందించారు.
ఇవి కూడా చదవండి:
అన్నీసార్లు దూకుడు పనికిరాదు: ఇర్ఫాన్ పఠాన్
గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అవుతాడు: మమతా బెనర్జీ
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి