Rishabh Pant: రెండో టెస్టులో గెలుస్తాం: పంత్
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:19 PM
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా బ్యాటర్ పంత్ స్పందించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. రెండో టెస్టులో బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడంపై టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) స్పందించాడు. ఓటమి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తేడాతో ఆధిక్యంలో ఉంది.
‘ఇలాంటి మ్యాచ్ తర్వాత.. దీని గురించి ఎక్కువగా ఆలోచించలేం. మాకు(Team India) మంచి అవకాశాలు వచ్చాయి. కానీ సద్వినియోగం చేసుకోలేకపోయాం. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నా.. బ్యాటర్లు పరిస్థితులకు అలవాటు పడలేదు. దానికి తోడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతడి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పిచ్‌పై 120 కూడా చాలా పెద్ద స్కోరే. మేం ఒత్తిడిని తట్టుకోలేకపోయాం. సౌతాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, బోష్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్‌కి అదే టర్నింగ్ పాయింట్ అయింది. ఈ టెస్టులో మేం చేసిన తప్పులను తెలుసుకున్నాం. రెండో టెస్టులో బలంగా తిరిగొస్తాం’ అని పంత్ వెల్లడించాడు. కాగా రెండో టెస్ట్ నవంబర్ 22న గువాహటి వేదికగా జరగనుంది.
క్రెడిట్ బౌలర్లదే: బావుమా
సౌతాఫ్రికా విజయంపై కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma) స్పందించాడు. ‘జట్టు గెలవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఈ క్రెడిట్ అంతా వాళ్లదే. నేను, బోష్ చేసిన భాగస్వామ్యం కూడా కీలకమే. నేను ప్రశాంతంగా టెక్నిక్‌ను నమ్ముకుని ఆడాను. ఆఖర్లో అక్షర్ పటేల్ ఫోర్, రెండు సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. ఎలాగైనా అతడిని ఔట్ చేయాలనుకున్నాం. ఆ క్యాచ్ ఎట్టకేలకు నేనే పట్టా. మ్యాచ్‌కు అదే టర్నింగ్ పాయింట్ అయింది’ అని బావుమా వివరించాడు.
హార్మర్.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’
సైమన్ హర్మర్.. ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ‘పిచ్ అనుకున్నట్లుగా లేదు. నేను నాతోనే ప్రశ్నలు వేసుకుంటూ ఓ ప్రణాళిక తయారు చేసుకున్నాను. గెలుపులో నా వంతు పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. నాకు రికార్డులు కాదు.. జట్టు గెలుపే ముఖ్యం’ అని హర్మర్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి