WC 2023: మనది కాని ఓ రోజు!
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:30 AM
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఓటమిని చవిచూసింది. ఆ టోర్నీ ఆసాంతం ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచిన భారత్.. ఫైనల్‌లో బలమైన ఆసీస్‌ను ఎదుర్కోలేకపోయింది. ఫలితం.. కంగూరులకే ప్రపంచ కప్ దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 19, 2023.. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం. వన్డే ప్రపంచ కప్(ODI WC 2023)లో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైన రోజు. టోర్నీ అంతా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన టీమిండియా ఆఖరి పోరులో తడబడింది. 2011 తర్వాత ట్రోఫీ ముద్దాడాలనే ఆశతో ఎదురుచూస్తోన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కలలు, ఆశలను చెరిపేసింది. అహ్మదాబాద్ స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. ఆ రోజు జ్ఞాపకాలు ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో ఓ చెరగని ముద్ర వేశాయి.
అసలేదీ కలిసి రాలేదు!
టోర్నీ ఆసాంతం టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. లీగ్ దశలో ఓడించినప్పటికీ ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు అనగానే ఏదో కంగారు! ఎందుకంటే వాళ్ల పట్టుదల వేరు.. పోరాటతత్వం వేరు! అయినా సరే టోర్నీలో మన ఆధిపత్యం చూశాక.. కంగారులైనా నిలవలేరులే అనే ధీమా. బలమైన ప్రత్యర్థిని ఓడించి కప్పు గెలిస్తేనే కదా మజా అన్న భావన. దూకుడుగా ఆడుతున్న రోహిత్ సేన దేశానికి మూడో కప్పు అందిస్తుందనే భరోసా! కానీ ఈ ఒక్క రోజు మన ఆధిపత్యం సాగలేదు. మన ప్రణాళికలు ఫలించలేదు. మన జట్టుకు అసలేదీ కలిసి రాలేదు.
అంతా తిరగబడింది..
రోహిత్(Rohit Sharma) చెలరేగుతున్నపుడు.. ‘350కి తగ్గేదేలే’ అన్న ధీమా. అతను ఔటైపోయి, ఇంకో వికెట్ పడగానే.. ‘300 కొడితే చాల్లే’ అన్న ఆశ. కోహ్లి(Virat Kohli) ఔటయ్యాక ‘270 అయినా చేస్తామా’ అన్న సందేహం. రాహుల్(KL Rahul) కూడా వెనుదిరిగాక 250 దాటమేమో అన్న కంగారు. చివరికి ఎక్కడ 220కే ఆలౌటైపోతామో అన్న భయం. ఆఖరికి స్కోరు 240 చేరితే హమ్మయ్య అనుకునే పరిస్థితి. టోర్నీ అంతటా మన జట్టు ఆధిపత్యాన్నే చూసిన అభిమానులకు ఫైనల్లో ఈ వెనుకబాటే అస్సలు రుచించలేదు. ఇక పలు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి బ్యాటర్లను చూసి జాలిపడే స్థాయిలో రెచ్చిపోయి వికెట్లు తీసిన మన బౌలర్లు.. ఫైనల్‌కు వచ్చేసరికి కీలక సమయాల్లో ప్రభావం చూపలేకపోయారు.
కల చెదిరింది!
2011లో ధోనీసేన కప్పు గెలిచి సచిన్ నిరీక్షణకు తెరదించినపుడు దేశం ఎంతగా ఉప్పొంగిందో తెలిసిందే. మళ్లీ మన గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో మన జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ.. ఫైనల్ చేరింది. తుది సమరంలోనూ మన జట్టే గెలిచి కోహ్లి, రోహిత్ లాంటి దిగ్గజాలు కప్పు అందుకుని వన్డే కెరీర్లను ముగిస్తే.. ఆ అద్భుత దృశ్యాలకు అహ్మదాబాద్ వేదిక అయితే.. ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలుండేవి కావు! కానీ కల చెదిరింది. కప్పు కోసం ఇన్ని కలలు కన్నాక ఇలాంటి ఓటమి వేదన కలిగించేదే. కానీ ఏం చేస్తాం..? ముందుకు సాగడమే. ముందుకు సాగాం.. అదే జోరు.. అదే హుషారుతో 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచేశాంగా!
ఇవి కూడా చదవండి:
కోచ్ మ్యాచ్ ఆడడు కదా!: రాబిన్ ఉతప్ప
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి