Harbhajan Singh: పాక్ బౌలర్‌కు భజ్జీ షేక్‌హ్యాండ్
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:38 PM
అబుదాబి టీ10 లీగ్‌లో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రత్యర్థి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ బౌలర్ దహానీకి భజ్జీ షేక్‌హ్యాండ్ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఏ మ్యాచ్‌లోనూ భారత్-పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం లేదు. ఏకంగా ఆసియా కప్ ట్రోఫీనే పాకిస్తాన్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు నిరాకరించారు. ఈ షేక్‌హ్యాండ్ వ్యవహారం అప్పటి నుంచి వివాదాస్పదమవుతూ వస్తోంది. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
అసలేం జరిగిందంటే?
అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్న భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ఆస్పిన్ స్టాలియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బుధవారం నార్తర్న్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్పిన్ స్టాలియన్స్ నాలుగు పరుగుల తేడాతో ఓడింది. నార్తర్న్ వారియర్స్‌కు ఆడుతున్న పాక్ బౌలర్ షానవాజ్ దహానీ(Shanawaz Dahani) రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయిన భజ్జీ.. దహానీకి షేక్‌హ్యాండ్ ఇచ్చి అభినందించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత పురుషుల జట్టుతో పాటు మహిళల టీమ్ కూడా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయట్లేదు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఆ జట్టులో హర్భజన్‌తోపాటు శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, వరుణ్ ఆరోన్ వంటి మాజీ ఆటగాళ్లున్నారు. పాక్‌తో మ్యాచ్‌ను ఆడమని వీరు తేల్చి చెప్పారు. సెమీస్‌లో కూడా దాయాది జట్టుతో మ్యాచ్ జరగాల్సి ఉండగా భారత్ బహిష్కరించింది. దీంతో పాక్ ఫైనల్‌కు వెళ్లింది. ఈ పరిణామాల తర్వాత పాక్ ఆటగాడికి షేక్‌హ్యాండ్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి