Eden Gardens: పిచ్‌పై కొత్త వివాదం
ABN , Publish Date - Nov 20 , 2025 | 09:43 AM
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పిచ్ వివాదంపై స్పందించాడు. ఇలాంటి పిచ్‌లను కోరడం మానుకోవాలని సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా చర్చల్లో నిలుస్తోంది అక్కడి పిచ్! భారత్ కోచ్ గౌతమ్ గంభీర్ బహిరంగంగా ‘మనకు కావాల్సిన పిచ్.. అనుకున్నట్టుగా పిచ్ ఉంది’ అని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. రెండు లేదా మూడో రోజు నుంచే అదనంగా టర్న్ తీసుకున్న ఈ పిచ్‌పై టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయింది.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) కొత్త ప్రశ్నల్ని లేవనెత్తాడు. స్పిన్‌కు సహకరించే పిచ్‌ల కోసం వెళ్లి అదే ఉచ్చులో టీమిండియా పడుతుందని సందేహం వ్యక్తం చేశాడు. 2024లో న్యూజిలాండ్‌తో 3–0తేడాతో క్లీన్ స్వీప్ అయిన తర్వాత పిచ్‌లపైనే ప్రశ్నలు తలెత్తిన విషయం గుర్తు చేశాడు.
‘కళ్లుమూసి తెరిచేలోపే మ్యాచ్ అయిపోయింది. ఇదే పిచ్ కావాలనుకున్నామని హెడ్ కోచ్ గంభీర్(Gautam Gambhir) అంటున్నారు. ఇలా చెప్పడం వల్ల ‘ఈ పిచ్ మీ కోసం సిద్ధం చేసిందే… మరి ఎందుకు ఆడలేకపోయారు?’ అని ప్లేయర్లపై తోసేసినట్లే ఉంది. భారత్‌ను భారత్‌లో ఓడించడం కష్టం. కానీ గత కొన్నేళ్లుగా టీమిండియాలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. నాలుగు టెస్ట్‌లు స్వదేశంలో ఓడిపోవడమనేది ఎవ్వరూ ఊహించని విషయం. స్పిన్ బాగా ఆడలేకపోతున్నారా? అంటే అలా ఏమీ నాకు అనిపించట్లేదు. ప్రత్యర్థులు ఈ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని సిద్ధమవుతున్నారు. భారత పిచ్‌ల్లో మార్పు కావాలి. ఈ విధంగా టర్న్ పిచ్‌లు కోరుకోవడం మానుకోవాలి. కనీసం నాలుగు రోజులు నిలిచే టెస్ట్ పిచ్‌లను అందించాలి’ అని సూచించాడు.
ఇదిలా ఉండగా, తొలి టెస్ట్‌లో భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. శుభ్‌మన్ గిల్ గాయంతో భారత్ ఒక బ్యాటర్ తగ్గడంతో పాటు పిచ్ స్వభావం కూడా టీమిండియా పరాభవానికి కారణమైందని విశ్లేషకుల అభిప్రాయం. కాగా నవంబర్ 22న గువాహటి వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
సౌతాఫ్రికాతో వన్డేలకు వాళ్లకు రెస్ట్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి