Share News

Mohammad Kaif: అతడొక డమ్మీ కెప్టెన్!: కైఫ్

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:46 AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో సీఎస్కే జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Mohammad Kaif: అతడొక డమ్మీ కెప్టెన్!: కైఫ్
Mohammad Kaif

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 హడావిడి ఇప్పటికే మొదలైంది. పది ఫ్రాంచైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలను కూడా విడుదల చేశాయి. అబుదాబి వేదికగా డిసెంబర్ 16న మినీ వేలంలో పాల్గొనేందుకు ఫ్రాంచైజీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీశాయి.


‘సీఎస్కే జట్టులో ధోనీ(MS Dhoni) పాత్ర ఇంపాక్ట్ ప్లేయర్ కంటే ఎక్కువ. అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడు. షాడో కెప్టెన్‌గా జట్టును నడిపిస్తాడు. ఆటగాళ్లకు గైడెన్స్ ఇస్తాడు. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కూడా ధోనీ సూచనలనే పాటిస్తాడు. అధికారికంగా రుతురాజ్ కెప్టెన్ కావొచ్చు.. కానీ అతడొక డమ్మీ కెప్టెన్ మాత్రమే. ధోనీ మైదానంలో ఉన్నంత వరకు అతడే సారథిగా వ్యవహరిస్తాడు. ధోనీ చెప్పిన విషయాలనే ఆటగాళ్లంతా పాటిస్తారు’ అని కైఫ్ వివరించాడు.


కెప్టెన్ రుతురాజ్..

సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Jadeja)ను రిలీజ్ చేసి రాజస్థాన్ రాయల్స్(RR) కెప్టెన్ సంజూ శాంసన్‌ను ట్రేడ్ ద్వారా చెన్నై సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జట్టు పగ్గాలు సంజూ(Sanju Samson)కే అప్పగిస్తారన్న ప్రచారమూ జరిగింది. ఈ వార్తలన్నింటికీ చెక్ పెడితూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ చెన్నైని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. అనంతరం 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ప్రకటించగా.. వరుస మ్యాచ్‌ల్లో జట్టు ఓటమిని ఎదుర్కొంది. దీంతో జడ్డూ మధ్యలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2024లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 2025లో గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే ఆటకు దూరం కాగా.. మళ్లీ ధోనీనే సారథిగా వ్యవహరించాడు.


ఇవి కూడా చదవండి:

మనది కాని ఓ రోజు!

ఎవరీ మిస్టరీ స్పిన్నర్?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 20 , 2025 | 07:11 AM