Manoj Tiwary: గంభీర్‌పై మాజీ ప్లేయర్ ఆగ్రహం
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:17 AM
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఈ విషయంపై స్పందించాడు. కోచ్‌గా ప్లేయర్లకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వాల్సింది మీరేనని గంభీర్‌కు సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఓటమికి పిచ్ కారణం కాదని, బ్యాటర్లు సరిగ్గా ఆడలేదని గంభీర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ(Manoj Tiwary) తప్పుబట్టాడు.
‘భారత క్రికెట్‌లో పరివర్తన దశ అనేదానికి తావు లేదు. టీమిండియాకు పరివర్తన అవసరం లేదు. మా దేశవాళీ క్రికెట్‌లో ఎంతోమంది ప్రతిభావంతులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరికొంత కాలం టెస్టు క్రికెట్ ఆడాల్సిన వారే. ఈ అనవసరమైన పరివర్తన అనే చర్చతో వారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమికి బ్యాటర్లను బాధ్యులను చేయడం పద్ధతి కాదు. ఓడిపోయిన తర్వాత వారి టెక్నిక్‌ను తప్పుపట్టలేరు. కోచ్‌గా ప్లేయర్లకు నేర్పించడం మీ బాధ్యత. బ్యాటర్లు సరిగ్గా డిఫెన్స్ ఆడలేదని అంటున్నారు. మ్యాచ్‌కు ముందు మీరే సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. గంభీర్(Gautam Gambhir) ఆటగాడిగా ఉన్నప్పుడు స్పిన్ బాగా ఆడేవాడు. కాబట్టి అతను మరింత బాగా నేర్పించాలి’ అని మనోజ్ తివారీ సూచించాడు.
ఇవి కూడా చదవండి:
సౌతాఫ్రికాతో వన్డేలకు వాళ్లకు రెస్ట్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి