Share News

Mushfiqur Rahim: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:44 AM

బంగ్లాదేశ్ తరఫున వంద టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వందో టెస్టులో సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Mushfiqur Rahim: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
Mushfiqur Rahim

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్(Mushfiqur Rahim) చరిత్ర సృష్టించాడు. వంద టెస్టులు ఆడిన ఏకైక బంగ్లా క్రికెటర్‌గా అతడు రికార్డులకెక్కాడు. తన కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న రహీమ్.. తాజాగా సెంచరీతో చెలరేగాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఈ ఫీట్ అందుకున్నాడు. ఓవర్ నైట్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజును ఆటను ప్రారంభించిన రహీమ్.. జోర్డాన్ నైల్ బౌలింగ్‌లో తన 13వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.


ఈ క్రమంలో ముష్ఫికర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వందో మ్యాచ్‌లో శతకం సాధించిన 11వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్, హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్ వంటి దిగ్గజాలు ఉన్నారు. దాంతో పాటు టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ త‌ర‌పున అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా మొమిముల్ హక్ రికార్డును ముష్ఫికర్ స‌మం చేశారు. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టుల్లో 13 సెంచ‌రీలు సాధించారు.


మరవలేని జ్ఞాపకం..

మ్యాచ్ ఆరంభానికి ముందు ముష్ఫికర్ రహీమ్‌ను మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా సన్మానించింది. 2005లో ఇంగ్లండ్‌పై 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన రహీమ్.. బంగ్లాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. సచిన్‌ టెండూల్కర్, ఇమ్రాన్‌ ఖాన్‌ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్‌ ఉన్న ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముష్ఫికర్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించింది. తొలి టెస్టు ఆడిన సహచరుల సంతకాలతో కూడిన జెర్సీతో పాటు... ప్రస్తుత మ్యాచ్‌ ఆడుతున్న ప్లేయర్ల సంతకాలతో కూడిన జెర్సీని అతడికి బహుమతిగా అందజేశారు. దీంతో పాటు 100 నంబర్‌తో ఉన్న ప్రత్యేక టోపీని బహుకరించారు.


ఇవి కూడా చదవండి:

పిచ్‌పై కొత్త వివాదం

సౌతాఫ్రికాతో వన్డేలకు వాళ్లకు రెస్ట్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 20 , 2025 | 10:44 AM