Guwahati pitch: దృష్టంతా గువాహటి పిచ్‌పైనే!
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:13 PM
కోల్‌కతా టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనికి కారణం పిచ్ అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా శనివారం నుంచి గువాహటి వేదికగా రెండో టెస్టు మొదలు కానుంది. దీంతో ఆ పిచ్‌పైనే అందరి దృష్టి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఛేదించలేకపోయారు. ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా(55*) మినహా మిగతా బ్యాటర్లేవరూ రాణించలేదు. బంతి విపరీతంగా బౌన్స్ అవ్వడంతో బ్యాటర్లు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. ఇరు జట్లూ కనీసం 200 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయాయి. దీంతో ఆ పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి.
నవంబర్ 22(శనివారం)న సౌతాఫ్రికా-టీమిండియా మధ్య రెండో టెస్టు జరగనుంది. దీనికి గువాహటి(Guwahati) ఆతిథ్యం ఇవ్వనుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గువాహటి పిచ్ ఎలా ఉండనుందనే దానిపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఈ పిచ్‌లో టర్నింగ్ ఉంటుందా? లేదా ఈ సారి కూడా మన ఉచ్చులో మనమై పడతామా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
పేస్, బౌన్స్‌లతో..
‘గువాహటి పిచ్ ఎర్రమట్టితో సిద్ధం చేశారు. దీంతో కాస్త ఎక్కువ పేస్, బౌన్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా ముందే కోరినట్లుగా కచ్చితంగా పిచ్‌లో టర్న్ ఉంటుంది. అలాగే బంతిలో టర్న్‌తో పాటు వేగం, బౌన్స్ కూడా ఉండనున్నాయి. అయితే ఆ బౌన్స్ మరీ ఎక్కువగా ఉండకుండా క్యురేటర్లు జాగ్రత తీసుకున్నారు’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ విషయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) కూడా స్పందించాడు. ‘తొలి రోజు కాస్త టర్న్ మాత్రమే ఉంటుంది. కాబట్టి టాస్ కీలకం కాదు. మేం మరీ స్పిన్ పిచ్‌ల కోసం చూడటం లేదు. టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి ఉంటే.. మీరసలు ఈ పిచ్ గురించి అడిగి ఉండేవారే కాదు. పిచ్ విషయం కాకుండా.. నైపుణ్యం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పిచ్‌లు ఇరు జట్లకూ ఒకేలా ఉంటాయి’ అని గంభీర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి