Virat Kohli: స్వామీజీ ఆశీస్సులు.. కోహ్లీకి తిరుగులేదు.. ఇక ఊచకోత మొదలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:12 AM
Virat-Anushka: ఫామ్‌తో సతమతమవుతున్నాడు టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలపాలవుతున్నాడు. ఈ తరుణంలో ఓ స్వామీజీని అతడు కలవడం ఆసక్తికరంగా మారింది. మరి.. ఎవరా స్వామీజీ? కోహ్లీ బ్యాట్ నుంచి మళ్లీ పరుగుల వరద పారనుందా? అనేది ఇప్పుడు చూద్దాం..

క్రీడాకారులు, సినీ తారలు, రాజకీయ నేతలు.. ఇలా చాలా మంది పాపులర్ సెలెబ్రిటీలు ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా దైవ దర్శనాలు చేస్తుంటారు. సాధారణ ప్రజల్లాగే వాళ్లూ మొక్కులు చెల్లించుకోవడం, కొత్త కోరికలు కోరుకోవడం, వైఫల్యాల నుంచి బయటపడేలా చూడమని దేవుడ్ని ప్రార్థించడం లాంటివి చేస్తుంటారు. ఇందుకు టీమిండియా క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని భుజాల మీద మోసే ప్లేయర్ల మీద ఎన్నో అంచనాలు, ఒత్తిళ్లు ఉంటాయి. అందుకే ఒక్కోసారి వాళ్లూ సరిగ్గా రాణించలేకపోతారు. అలాంటి టైమ్‌లో తమను తాము రీఫ్రెష్ చేసుకునేందుకు, కొత్త ఉత్సాహంతో తిరిగొచ్చేందుకు ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తుంటారు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు.
ఫ్యామిలీతో కలసి..
ఫామ్‌తో సతమతమవుతున్నాడు టీమిండియా సీనియర్ బ్యాటర్ కోహ్లీ. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలపాలవుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా టూర్‌లో అతడి ఆట చూసి అసలు విరాట్‌కు ఏమైందని అంతా ఆశ్చర్యపోయారు. అతడి పనైపోయింది.. మూటాముల్లె సర్దుకొని యంగ్‌స్టర్స్‌కు అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో కోహ్లీ ఓ స్వామీజీని కలవడం ఆసక్తిని సంతరించుకుంది. సతీమణి అనుష్క శర్మతో పాటు ఇద్దరు పిల్లలతో కలసి బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్‌ను కలిశాడు విరాట్. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎవరీ ప్రేమానంద్ మహారాజ్?
సత్సంగ్‌ల ద్వారా హైందవ మతంతో పాటు జీవన విధానం, విజయాలు-వైఫల్యాలు, కష్టాలు-సుఖాలు.. ఇలా ఎన్నో విషయాలపై ప్రసంగాలు ఇస్తుంటారు ప్రేమానంద్ మహారాజ్. ఆయన దర్శనం కోసం చాలా మంది ప్రముఖులు వస్తుంటారు. కోహ్లీ-అనుష్క కూడా 2023లో ఒకసారి ఆయన్ను కలిశారు. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ నేపథ్యంలో మరోసారి స్వామీజీ దర్శనానికి విచ్చేశారు. ‘కోట్ల మంది భారతీయుల కలల్ని కోహ్లీ మోస్తున్నాడు. అతడు సక్సెస్ అవడం ఎంతో అవసరం. అతడు బాగా ఆడితే దేశం మొత్తం సంతోషంలో మునిగిపోతుంది’ అని ప్రేమానంద్ చెబుతూ విరాట్‌లో ధైర్యం నూరిపోశారు. ఇది చూసిన నెటిజన్స్.. కింగ్‌కు ఇక తిరుగులేదని అంటున్నారు. అతడి బ్యాట్ నుంచి ఇక పరుగుల వరద పారడం ఖాయమని.. మళ్లీ పాత కోహ్లీని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో స్వామీజీని కలిశాక అతడు బ్యాట్‌తో చెలరేగాడని.. ఇప్పుడు అదే రిపీట్ అవబోతోందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
రేడియో జాకీతో చాహల్ డేటింగ్ ?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి