Tilak Varma: అందరూ తిలక్‌ను పొగుడుతున్నారు.. కానీ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు
ABN , Publish Date - Jan 26 , 2025 | 01:56 PM
IND vs ENG: టీమిండియా విజయాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది సూర్య సేన.

టీ20 క్రికెట్‌లో భారత్ జోరు మామూలుగా లేదు. గతేడాది జరిగిన పొట్టి ప్రపంచ కప్-2024 దగ్గర నుంచి ఇప్పటివరకు ఆ ఫార్మాట్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తోంది టీమిండియా. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లోనూ కుర్రాళ్లతో నిండిన సూర్య సేన అద్భుత విజయాలు అందుకుంటూ అదరగొడుతోంది. నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో మన జట్టు 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ తిలక్ వర్మ స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో టీమ్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. అయితే గేమ్ చేంజర్ మాత్రం మరో ప్లేయర్ ఉన్నాడు. అతడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
మర్చిపోతే ఎలా?
టార్గెట్ 166. స్కోరు బోర్డు మీదకు 20 పరుగులు కూడా చేరకముందే ఓపెనర్లు అభిషేక్ శర్మ (5), సంజూ శాంసన్ (12) పెవిలియన్ బాట పట్టారు. కాపాడతాడని అనుకున్న కెప్టెన్ సూర్యకుమార్ కూడా 12 పరుగులు చేసి క్రీజును వీడాడు. ధృవ్ జురెల్ (4), హార్దిక్ పాండ్యా (7) కూడా ఫెయిలయ్యారు. అయితే మొండిగా క్రీజులో పాతుకుపోయిన తిలక్ (55 బంతుల్లో 72 నాటౌట్) మ్యాచ్ ఫినిష్ చేసే వరకు వదల్లేదు. వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 26)తో పాటు ఆఖర్లో రవి బిష్ణోయ్ (9 నాటౌట్) సాయంతో జట్టుకు విక్టరీ అందించాడు. క్లిష్ట పరిస్థితులు, తీవ్ర ఒత్తిడి మధ్య తిలక్ ఆడిన తీరు, ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన విధానం, కంపోజర్ అంతా నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అందుకే అంతా అతడిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అయితే మరో హీరో బిష్ణోయ్‌ను అందరూ మర్చిపోతున్నారు.
ఒంటరి పోరాటం!
చెపాక్ టీ20లో తిలక్ ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. కానీ మరో ఎండ్ నుంచి పెద్దగా సహకారం అందలేదు. సుందర్, అక్షర్ పటేల్ కీలక సమయంలో ఔట్ అవడంతో భారత్ కష్టాల్లో పడింది. విజయానికి ఆఖరి 18 బంతుల్లో మరో 20 పరుగులు కావాలి. చేతిలో 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన స్పిన్నర్ బిష్ణోయ్ ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. అప్పటికే 3 వికెట్లు తీసిన కార్స్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ బ్యూటిఫుల్ ఫ్లిక్ షాట్‌తో 4 పరుగులు రాబట్టాడు. అలాగే లివింగ్‌స్టన్ బౌలింగ్‌లో మరో బౌండరీ బాదాడు.
టర్నింగ్ పాయింట్!
బిష్ణోయ్ చేసిన 9 పరుగులతో తిలక్ మీద ప్రెజర్ తగ్గింది. దీంతో అతడు మిగిలిన పనిని ఆడుతూ పాడుతూ పూర్తి చేశాడు. బిష్ణోయ్ వికెట్ పడి ఉంటే గెలుపు కష్టమయ్యేది. అతడు ఔట్ అవ్వకపోవడమే గాక కీలకమైన పరుగులు చేశాడు. ఫోర్లు బాది ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. తిలక్ ఇన్నింగ్స్‌ను తక్కువ చేయడానికి లేదు. అతడ్ని ఎంత పొగిడినా తక్కువే. అదే టైమ్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పిన బిష్ణోయ్‌ను కూడా మెచ్చుకోవాల్సిందే. బౌలర్లకు బ్యాటింగ్ ఎబిలిటీ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్‌లో టీమ్‌కు ఎంతో హెల్ప్ అవుతుందని మరోమారు ప్రూవ్ అయింది.
ఇదీ చదవండి:
టీ20 ఉత్తమ క్రికెటర్‌గా అర్ష్‌దీప్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి