Shubman Gill: రియల్ లీడర్ అతడే.. కెప్టెన్సీపై గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - May 25 , 2025 | 02:56 PM
టీమిండియా కెప్టెన్సీపై శుబ్‌మన్ గిల్ స్పందించాడు. సారథ్యం వహించే అవకాశం దక్కడంపై అతడు తనదైన రీతిలో రియాక్ట్ అయ్యాడు. గిల్ అసలు ఏమన్నాడంటే..

కొన్నేళ్ల కింద టీమిండియాలోకి అడుగుపెట్టిన కుర్ర బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతి చోటా అదరగొడుతూ మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్‌గా మారాడు. అతడి బ్యాటింగ్ స్కిల్స్‌తో పాటు క్రమశిక్షణ, ప్రశాంతంగా ఉండే తత్వం, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిని డీల్ చేసే విధానం నచ్చి ఏకంగా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది బీసీసీఐ. రోహిత్ వారసుడిగా అతడ్ని ఎంపిక చేసింది. జట్టును సమర్థంగా నడిపించే దమ్ము గిల్‌కు ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ మీట్‌లో తెలిపాడు. ఈ నేపథ్యంలో సారథ్య బాధ్యతలు అప్పజెప్పడంపై తాజాగా గిల్ స్పందించాడు. ఇంతకీ అతడేం అన్నాడో ఇప్పుడు చూద్దాం..
అదే నా పని!
క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన ప్రతి పిల్లాడు ఎప్పటికైనా దేశానికి ఆడాలని అనుకుంటాడని.. తానూ అలాగే కలగన్నానని తెలిపాడు గిల్. టీమిండియాకు టెస్టుల్లో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించాలని భావించానని చెప్పాడు. అలాంటిది ఏకంగా జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కడం నిజంగా గొప్ప గౌరవమని తెలిపాడు గిల్. ఇది చాలా పెద్ద బాధ్యత అని పేర్కొన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వ్యూహాలు పన్నడం.. ఇలా ఏదైనా కానివ్వండి టీమ్‌ను బయటపడేసేందుకు కెప్టెన్‌గా ఏం చేశామనేదే ముఖ్యమని తాను భావిస్తానని తెలిపాడు. జట్టు మీద ఉన్న ఒత్తిడిని తొలగించడంతో పాటు ఆటగాళ్లపై భరోసా ఉంచి వాళ్ల నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను రాబట్టడం సారథిగా తన మీద ఉన్న పెద్ద బాధ్యత అని పేర్కొన్నాడు గిల్. టీమ్‌ను కష్టాల కడలి నుంచి బయటపడేసేవాడే నిజమైన సారథి అని వ్యాఖ్యానించాడు. గత సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని నుంచి తాను చాలా అమూల్యమైన విషయాలు నేర్చుకున్నానని వివరించాడు శుబ్‌మన్. టీమ్‌ను నడిపించడంలో వాళ్ల ముగ్గురిది ఒక్కో శైలి అని చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
అందుకే ‘క్రికెట్ కింగ్’ అయ్యాడు...
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి