Ganguly On Gill Captaincy: హనీమూన్ అనుకున్నావా? గిల్‌కు గంగూలీ వార్నింగ్!
ABN , Publish Date - Jul 09 , 2025 | 08:57 AM
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ రిజల్ట్‌నే లార్డ్స్‌లోనూ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో గిల్ నాయకత్వం గురించి దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఘనవిజయం సాధించిన టీమిండియా.. మరో చాలెంజ్‌కు రెడీ అవుతోంది. క్రికెట్‌కు పుట్టినిల్లుగా చెప్పుకునే లార్డ్స్‌లోనూ విజయబావుటా ఎగురవేయాలని అనుకుంటోంది. ఇక్కడ కూడా ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని భావిస్తోంది. ఓవర్సీస్‌లో వరుసగా రెండు టెస్టులు ఇప్పటిదాకా గెలవని భారత్.. ఈసారి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. కొత్త సారథి శుబ్‌మన్ గిల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని అనుకుంటున్నాడు. ఈ తరుణంలో లెజెండరీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నాడు.
ఒత్తిడి తప్పదు..
‘సారథిగా గిల్ తన ప్రయాణాన్ని అద్భుతంగా మొదలుపెట్టాడు. అయితే ఇక మీదట ఇలాగే ఉండదు. అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కొత్త. ఆ పరంగా ఇది శుబ్‌మన్‌కు హనీమూన్ పీరియడ్. కానీ రాబోయే సిరీస్‌ల్లో అతడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోక తప్పదు. ఇంగ్లండ్‌తో తదుపరి జరిగే 3 టెస్టుల్లో గిల్‌పై కచ్చితంగా ప్రెజర్ పడుతుంది’ అని దాదా చెప్పుకొచ్చాడు. హనీమూన్ పీరియడ్ ముగిసిందనే విషయాన్ని అతడు గ్రహించాలని.. రాన్రానూ అతడిపై తీవ్ర ఒత్తిడి పడటం ఖాయమన్నాడు గంగూలీ. సవాళ్లకు సిద్ధంగా ఉండాలని.. లైట్ తీసుకుంటానంటే కుదరదన్నాడు.
ప్రతిభకు లోటు లేదు..
భారత్‌లో అపార ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని గంగూలీ అన్నాడు. ప్రతి తరంలో అద్భుతమైన ఆటగాళ్లు వస్తున్నారని చెప్పాడు. ‘భారత క్రికెట్‌లో అపార ప్రతిభ దాగి ఉంది. ప్రతి తరంలో కొత్త ప్లేయర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజాల తర్వాత విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు వచ్చారు. ఇప్పుడు శుబ్‌మన్ గిల్, ఆకాశ్‌దీప్, యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్ లాంటి వాళ్లు అదరగొడుతున్నారు. దిగ్గజాలు నిష్క్రమించినా ఆ లోటు కనిపించకుండా చేస్తున్నారు కొత్త కుర్రాళ్లు’ అని దాదా మెచ్చుకున్నాడు.
ఇవీ చదవండి:
స్విస్ చెస్‌లో అర్జున్‌కు టాప్ సీడ్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి