Shikhar Dhawan: నన్ను కావాలనే బ్లాక్ చేశారు.. ధావన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:03 PM
Team India: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు తనను కావాలనే బ్లాక్ చేశారని అన్నాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

టీమిండియాకు ఆడిన టఫెస్ట్ క్రికెటర్లలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకడు. ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ధనాధన్ బ్యాటర్.. పరుగులు వరద పారిస్తూ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో మెన్ ఇన్ బ్లూకు గెలుపులు అందించాడు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ధవన్.. బరిలోకి దిగితే బౌలర్ల బెండు తీసేవాడు. భారీ షాట్లతో విరుచుకుపడేవాడు. అందుకే అతడ్ని గబ్బర్ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఇంకా పలు టీ20 లీగ్స్ ఆడుతూ బిజీగా ఉన్నాడు ధావన్. అయితే అతడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను వాళ్లు బ్లాక్ చేశారని అన్నాడు.
నో చాన్స్!
బయట చూసేందుకు బలశాలిగా కనిపించే ధావన్ లోలోపల మాత్రం తీవ్రంగా మనో వేదనకు గురవుతున్నాడు. దీనికి కారణం కొడుకు జొరావర్‌ను అతడికి దూరం చేయడమేనట. విడాకుల తర్వాత నుంచి ధావన్ కుమారుడు అతడి తల్లి అయేషా ముఖర్జీ దగ్గరే ఉంటున్నాడు. దీంతో అతడ్ని కలిసేందుకు ధవన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవనివ్వలేదట. కనీసం ఫోన్‌లో మాట్లాడదామన్నా అతడ్ని బ్లాక్ చేసేశారట. ఇదే విషయాన్ని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకుంటూ ఎమోషనల్ అయిపోయాడు ధావన్.
ఎంతో మిస్ అవుతున్నా!
‘నా కుమారుడ్ని ఎంతో మిస్ అవుతున్నా. అతడ్ని కలవక 2 సంవత్సరాలు కావొస్తోంది. మేం ఇద్దరం మాట్లాడుకొని ఏడాదికి పైనే అవుతోంది. నన్ను అన్ని చోట్లా బ్లాక్ చేసేశారు. అయితే మేం ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయి ఉన్నాం. అతడితో రోజూ మాట్లాడుతున్నట్లు, కౌగిలించుకున్నట్లు అనిపిస్తోంది. జొరావర్‌ను ఎంతో మిస్ అవుతున్నా. అతడికి దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది. అతడికి ఇప్పుడు 11 ఏళ్లు. కానీ అతడితో నేను రెండున్నరేళ్లు మాత్రమే గడిపా’ అని ధావన్ చెప్పుకొచ్చాడు. జొరావర్ ఎక్కడ ఉన్నా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనేదే తన అభిమతమని పేర్కొన్నాడు. తన నంబర్‌ను బ్లాక్ చేసినా ఇంకా మెసేజ్‌లు పంపిస్తూనే ఉన్నానని స్పష్టం చేశాడు. ఏదో ఒక రోజు వాటిని అతడికి చూపిస్తానని వ్యాఖ్యానించాడు ధావన్.
ఇవీ చదవండి:
వాళ్లేమీ దేవుళ్లు కాదు: అశ్విన్
తెలుగు బిడ్డ సంచలనం.. ఒక్క డైవ్‌తో..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి